హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత యడ్లపాటి వెంకట్రావు (Venkatrao ) కన్నుమూశారు. 102 ఏండ్ల వెంకట్రావు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. పరిస్థితి విషమించడంతో సోమవారం ఉదయం హైదరాబాద్లోని తన కుమార్తె నివాసంలో తుదిశ్వాస విడిచారు. రైతు నాయకుడిగా సేవలందించిన ఆయన.. సంగం డెయిరీకి వ్యవస్థాపక అధ్యక్షుడిగా పనిచేశారు.
యడ్లపాటి వెంకట్రావు 1919 డిసెంబర్ 16న గుంటూరు జిల్లాలోని బోడపాడులో జన్మించారు. ప్రముఖ రైతు నాయకుడు ఎన్జీ రంగా ముఖ్య అనుచరుడిగా ప్రాచుర్యం పొందారు. 1967, 72 ఎన్నికల్లో స్వతంత్ర పార్టీ తరపున, 1978లో కాంగ్రెస్ పార్టీ నుంచి వేమూరు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1978-80 మధ్యకాలంలో మర్రి చెన్నారెడ్డి మంత్రివర్గంలో వ్యవసాయ మంత్రిగా పనిచేశారు. అనంతరం టీడీపీలో చేరియన ఆయన.. రాజ్యసభ సభ్యుడిగా వ్యవహరించారు. 2004 నుంచి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.