AP News | కాకినాడ పోర్టులో బియ్యం అక్రమ రవాణాపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన తనిఖీలు ఏపీలో రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. వైసీపీ నేతల బియ్యం అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని కూటమి నేతలు ఆరోపిస్తుంటే.. ఆర్థిక మంత్రి వియ్యంకుడే రేషన్ బియ్యం అక్రమ రవాణా చేస్తున్నారని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఇలా తన వియ్యంకుడిపై వస్తున్న ఆరోపణలపై ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ స్పందించారు. రేషన్ బియ్యంతో తన వియ్యంకుడికి సంబంధం లేదని.. రైతుల దగ్గర ధాన్యం కొని.. మిల్లింగ్ చేసుకుని ఎగుమతి చేస్తారని స్పష్టం చేశారు.
తమ వియ్యంకుడి కుటుంబం మూడు తరాలుగా బాయిల్డ్ రైస్ ఎగుమతి వ్యాపారం చేస్తున్నారని పయ్యావుల కేశవ్ తెలిపారు. వాళ్ల కుటుంబం ముడి బియ్యం వ్యాపారం చేయదని.. కేవలం స్టీమ్ రైస్ మాత్రమే ఎగుమతి చేస్తుందని పేర్కొన్నారు. తనతో వియ్యం పొందాక ఆయన బియ్యం వ్యాపారం చేయడం లేదని చెప్పారు. రేషన్ బియ్యంతో తన వియ్యంకుడి వ్యాపారానికి సంబంధం లేదని వెల్లడించారు. రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేసి సొంత ఫ్యాక్టరీలో మిల్లింగ్ చేసుకుని ఎగుమతి చేస్తారని స్పష్టం చేశారు.
కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోనే తమ వియ్యంకుడు బియ్యం వ్యాపారం చేస్తున్నారని.. ఏపీలో గింజ కూడా కొనుగోలు చేయలేదని పయ్యావుల కేశవ్ అన్నారు. పేర్ని నాని, అంబటి రాంబాబుకు అనుమానం ఉంటే చెక్ పోస్టు దగ్గర ప్రతి బ్యాగ్ తనిఖీ చేసుకోవచ్చని సవాలు విసిరారు. ఆ తనిఖీలకు తానే అన్ని అనుమతులు ఇప్పిస్తానని కూడా చెప్పారు.