అమరావతి : తిరుమల లడ్డూ కేసు (Laddu Adultration) వ్యవహారాన్ని తేల్చేందుకు సుప్రీం కోర్టు (Supreme Court) ఆదేశాలతో ఏర్పాటుచేసిన సిట్ దర్యాప్తులో విచారణకు ఇద్దరు ఏపీ పోలీసుల అధికారుల పేర్లను డీజీపీ ద్వారకా తిరుమలరావు ( DGP Tirumala Rao) ప్రకటించారు.
కేంద్రం నుంచి ఇద్దరు, ఏపీ పోలీసుల నుంచి ఇద్దరు , ఒకరు ఫుడ్ కంట్రోల్ అధికారిని నియమించి వారి ఆధ్వర్యంలో దర్యాప్తు చేయాలని సుప్రీంకోర్టు ఇదివరకే ఆదేశించిన విషయం తెలిసిందే. సిట్ సభ్యులుగా ఐజీ సర్వశ్రేష్ఠా త్రిపాఠి, డీఐజీ గోపీనాథ్ జెట్టి పేర్లను పంపామని డీజీపీ వెల్లడించారు. లడ్డూ కల్తీ నెయ్యి కేసులో రాష్ట్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ను సుప్రీంకోర్టు అనుమానించలేదని స్పష్టం చేశారు. కేసులో స్వతంత్ర దర్యాప్తు జరగాలన్న ఉద్దేశంతోనే ప్రత్యేక బృందం ఏర్పాటు చేసిందన్నారు. దీంట్లో ఏపీ పోలీసుల జోక్యం ఉండదన్నారు.
టీడీపీ కేంద్ర కార్యాలయం, గన్నవరం పార్టీ ఆఫీసుపై దాడి కేసులతో పాటు మరో రెండు కేసులను సీఐడీకి బదిలీ చేసినట్లు తెలిపారు. ఒక కేసులో వైసీపీ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala Ramakrishna Reddy) పై లుకౌట్ నోటీసును గుంటూరు జిల్లా ఎస్పీ జారీ చేశారని చెప్పారు.