Raghurama Krishna Raju | అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా అడగడంపై వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు తీవ్రంగా మండిపడ్డారు. ప్రతిపక్ష హోదాను స్పీకర్, సీఎం ఇవ్వరని.. ప్రజలు ఇవ్వాలని తెలిపారు. సోమవారం నాడు ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యే ఎవరైనా 60 రోజుల పాటు లీవ్ అడగకుండా సభకు రాకుంటే.. అనర్హత వేటు పడుతుందని తెలిపారు. ఒకవేళ జగన్ అసెంబ్లీకి రాకపోతే పులివెందులకు ఉప ఎన్నిక వస్తుందని స్పష్టం చేశారు.
జగన్ అసెంబ్లీకి రావాలని తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని రఘురామ కృష్ణరాజు అన్నారు. ఆయన అసెంబ్లీకి వచ్చి తన మనోభావాలు పంచుకోవాలని కోరారు. తన కస్టోడియల్ టార్చర్ కేసులో సునీల్‌కుమార్ పాత్ర స్పష్టమైందని తెలిపారు. ప్రజా ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని నమ్ముతున్నానని పేర్కొన్నారు. తనకు సంపూర్ణ విశ్వాసం ఉందని. దోషులకు శిక్షపడుతుందనే నమ్మకం ఉందని చెప్పారు.
కస్టోడియల్ టార్చర్ కేసులో గతంలో ఎన్నో ఫిర్యాదులు చేశానని రఘురామ తెలిపారు. సమాజాన్ని మతాలు, కులాల వారీగా విడగొట్టేవిధంగా మాట్లాడారని మండిపడ్డారు. కానీ సునీల్‌కుమార్ అతి తెలివితేటలు ఉపయోగించి యూట్యూబ్‌లో ఉన్న వీడియోలను తీసేయించారని పేర్కొన్నారు. ప్రభుత్వానికి తానొక బాధితుడిగా ఫిర్యాదు చేశానని అన్నారు. కస్టోడియల్ టార్చర్ కేసులో తన పోరాటం ఆగదని స్పష్టం చేశారు.