Pawan Kalyan | పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలపై భారత్ చేసిన దాడులపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా చేయడం భారతదేశంలో ప్రతి ఒక్కరూ గర్వించదగ్గ విషయమని కొనియాడారు. పహల్గాం దాడి సమయంలో హిందువులా? కాదా? అని అడిగి మరీ ఉగ్రవాదులు చంపారని పవన్ కల్యాణ్ తెలిపారు. దేశం మొత్తం పుట్టెడు దుఃఖంలో ఉందని.. ఆ ఘటనకు ప్రతీకారం తీర్చుకోవాలని యావత్ దేశం ఎదురుచూసిందని పేర్కొన్నారు.
ప్రధాని మోదీ నాయకత్వంలో రక్షణ దళాలు దీటుగా పాక్‌లోని ఉగ్ర స్థావరాలపై దాడి చేసి బుద్ధి చెప్పాయని పవన్ కల్యాణ్ అన్నారు. పాకిస్థాన్ ప్రజలకు, మిలటరీకి ఎలాంటి నష్టం వాటిల్లకుండా కేవలం ఉగ్రవాదుల మీద, ఉగ్రవాదుల స్థావరాల మీద ఇండియన్ ఆర్మీ దాడి చేయడం గొప్ప విషయమని కొనియాడారు. ఈ సమయంలో ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం పట్ల అందరం గర్వించాలని.. అండగా నిలవాలని అన్నారు. చివరి ఉగ్రవాదిని అంతం చేసే వరకు ఆయన పోరాటం ఆగదని స్పష్టం చేశారు. పాకిస్థాన్‌కు మద్దతుగా ఆలోచించే నాయకులు తమ వైఖరి మార్చుకోవాలని సూచించారు. కుక్కలు అరిచినట్లు సోషల్‌మీడియాలో ఎవరూ అరవద్దని.. దేశానికి వ్యతిరేకంగా సోషల్‌మీడియాలో పోస్టులు పెట్టవద్దని అన్నారు. ముఖ్యంగా సెలబ్రెటీలు, ఇన్‌ఫ్ల్యూయెన్సర్లు సోషల్‌మీడియాలో ఏది పడితే అది పెట్టవద్దని హితవు పలికారు. ఎవరైనా దేశానికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే చర్చలు తప్పవని హెచ్చరించారు.