Pawan Kalyan | గత పాలకుల సమయాన్ని డార్క్ సమయంగా చెప్పవచ్చని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. 2019 నుంచి 2024 వరకు బ్రిటీష్ పాలన మాదిరిగా సాగిందని విమర్శించారు. స్వాతంత్య్ర సమరయోధుల స్ఫూర్తితో పాలన కొనసాగిస్తున్నామని తెలిపారు. కాకినాడలో నిర్వహించిన 79వ స్వాతంత్య్ర దినోత్సవంలో తన సతీమణితో కలిసి పవన్ కల్యాణ్ పాల్గొన్నారు.
రాష్ట్ర అభివృద్ధికి, పెట్టుబడులు రావాలంటే శాంతి భద్రతలు బలంగా ఉండాలని పవన్ కల్యాణ్ అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ, సుస్థిర పాలన కూటమి ప్రభుత్వ బాధ్యత అని తెలిపారు. గత ప్రభుత్వం చీకటి రోజులను స్వతంత్ర సమరయోధుల స్ఫూర్తితో ఎదుర్కొన్నామని తెలిపారు. దేశంలో అంతర్గత సుస్థిరత దెబ్బతీసేవారిపై ఓ కన్నసి ఉంచాలని పిలుపునిచ్చారు. విదేశీ శక్తుల ఎజెండాను మోస్తున్న వారిపట్ల అప్రమత్తత అవసరమని పేర్కొన్నారు. అంతర్గత శత్రువులను ఓ కంట కనిపెట్టాలని సూచించారు.
ప్రతిపక్ష నాయకులు ఓడిపోతే ఓటు చోరీ అంటున్నారని పవన్ కల్యాణ్ మండిపడ్డారు. గెలిచినప్పుడు ఒక న్యాయం.. ఓడినప్పుడు మరో న్యాయమా అని ప్రశ్నించారు. వైసీపీ పాలనలో గొంతెత్తితో దాడులు జరిగేవని ఆరోపించారు. అవినీతికి అలవాటుపడిన వాళ్లు ఏమైనా చేస్తారని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజలంతా స్వేచ్ఛగా ఉన్నారని చెప్పారు. పోర్టు ప్రాంతం, తీర ప్రాంతాల్లో గస్తీని బలంగా ఉంచుతామని పేర్కొన్నారు.
కాకినాడలో డీజిల్ అక్రమ రవాణా జరుగుతుందని పవన్ కల్యాణ్ తెలిపారు. బియ్యం, డీజిల్ అని వదిలేస్తే తీర ప్రాంతం నుంచి మారణాయుధాలు, బాంబులు తీసుకొస్తారని హెచ్చరించారు. అందుకే తీర ప్రాంతాల్లో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.