అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలపై ప్రభుత్వ ప్రధానకార్యదర్శి జవహర్‌రెడ్డి (CS Jawahar Reddy), డీజీపీ హరీస్ గుప్తా (DGP Harish Gupta)గురువారం మధ్యాహ్నం కేంద్ర ఎన్నికల సంఘం (CEC) అధికారులను కలిసి వివరించారు.
ఈనెల 13న జరిగిన ఎన్నికల రోజు, మరుసటి రోజు రాష్ట్రంలోని పలు జిల్లాలో హింసాత్మక ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. దీనిపై గురువారం మధ్యాహ్నం స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని ఇద్దరిని ఆదేశించడంతో సీఎస్, డీజీపీ ఢిల్లీకి బయలు దేరి సీఈసీని కలిశారు. పల్నాడు, కారంపూడి, చంద్రగిరి, తాడిపత్రిలో ఘర్షణలు ఎందుకు జరిగాయని, పోలీసుల నిఘా సంస్థ ఎందుకు గట్టి చర్యలు తీసుకోలేకపోయిందని ప్రశ్నించారు.
పోలింగ్ రోజున పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించిన విషయాన్ని ఎన్నికల పరిశీలకులు ఈసీకి నివేదిక ఇవ్వడంతో వాటి గురించి కూడా ఇద్దరిని ప్రశ్నించారు. బందోబస్తు విషయంలో నిర్లక్ష్యం వహించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. రాష్ట్రంలో జరిగిన ఘటనలు, తీసుకున్న చర్యలు, భవిష్యత్‌లో తీసుకోబోయే చర్యలను సీఎస్, డీజీపీలు నివేదిక రూపంలో అందజేశారు.