YS Sharmila | బీజేపీకి ఇవ్వాళ రాజ్యాంగం అంటే గౌరవం లేదని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. స్వాతంత్ర్య సమరయోధులను సైతం బీజేపీ అవమానిస్తోందని.. అంబేద్కర్‌ను హేళన చేస్తున్నారని అన్నారు. మహాత్మ గాంధీని విలన్‌గా చూపిస్తున్నారని మండిపడ్డారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా విజయవాడ ఆంధ్రరత్న భవన్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో జాతీయ జెండాను వైఎస్ షర్మిల ఎగురవేశారు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. ఏడు దశాబ్దాల క్రితం ఇదే రోజు మన రాజ్యాంగం అమల్లోకి వచ్చిందని అన్నారు. మన దేశం ఒక స్వయం పరిపాలిత దేశంగా మారిందని తెలిపారు. మన దేశం విభిన్న సంస్కృతితో కూడిన నిలయమని.. భిన్నత్వంలో ఏకత్వం మన నినాదమని అన్నారు. మనకున్న ఈ హక్కులు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం కల్పించినవే అని గుర్తుచేశారు.
గాంధీని చంపిన గాడ్సేకి గుడులు కడుతున్నారని.. మతం,కులం పేరుతో కలహాలు రేపుతున్నారని బీజేపీపై షర్మిల మండిపడ్డారు. దేశ సంపదను మోదీ తన దోస్తులకు దోచిపెడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వ సంస్థలను గుప్పిట్లో పెట్టుకొని దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు. పార్లమెంట్ వేదికగా అంబేద్కర్ ను అవమానిస్తే టీడీపీ, వైసీపీలు బీజేపీతో జత కట్టి అన్యాయానికి వత్తాసు పలుకుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజన హామీలపై మోసం చేసినా పోటీ పడి పొత్తులు పెట్టుకుంటున్నాయని విమర్శించారు. చంద్రబాబుది తెరముందు పొత్తు.. జగన్‌ది తెరవెనుక పొత్తు అని ఎద్దేవా చేశారు.
జగన్ బీజేపీకి గులాంగిరీ చేశారని వైఎస్ షర్మిల అన్నారు. వైఎస్ఆర్ ఆశయాలను తుంగలో తొక్కారని మండిపడ్డారు. వైసీపీకి దళితులు ఓట్లు వేసి గెలిపిస్తే వారి పట్ల కృతజ్ఞత భావం లేదని.. దళితులను అవమానిస్తుంటే కనీసం చిన్న ఖండన కూడా లేదని విమర్శించారు. అంబేద్కర్ విగ్రహాలు పెడితే గౌరవం ఉన్నట్లు కాదని.. అంబేద్కర్ కి అవమానం జరిగితే వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఒక్క మాట కూడా మాట్లాడలేదని అన్నారు. బీజేపీతో ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తంచేశారు. బీజేపీ అధికారంలో ఉంటే రాజ్యాంగాన్ని మార్చుతుందని.. రిజర్వేషన్లు ఎత్తేస్తుందని.. మతాల మధ్య, కులాల మధ్య చిచ్చు పెడుతుందని ఆరోపించారు. ఈ దేశానికి మేలు చేసేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని స్పష్టం చేశారు.