YS Jagan | అనంతపురం జిల్లాలో ఇంటర్ విద్యార్థిని దారుణ హత్యను ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో మహిళలకు, బాలికలకు రక్షణ, భద్రత లేకుండా పోయిందని విమర్శించారు. శాంతి భద్రతల నిర్వహణలో చంద్రబాబు వైఫల్యం.. ఇలాంటి దారుణాల రూపంలో ప్రతిరోజూ కనిపిస్తూనే ఉందని అన్నారు.
అనంతపురంలో ఇంటర్మీడియట్ చదువుతున్న గిరిజన బాలిక సాకె తన్మయిని అత్యంత దారుణంగా హత్యచేశారని వైఎస్ జగన్ అన్నారు. ఈనెల జూన్ 3న తమ కుమార్తె కనిపించడం లేదని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఆ అమ్మాయిని రక్షించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని తెలిపారు. ఆరు రోజుల తర్వాత కూడేరు మండలం బ్రాహ్మణపల్లె సమీపంలో తన్మయి మృతదేహాన్ని గుర్తించారని చెప్పారు. తన్మయి హత్య పూర్తిగా యంత్రాంగ వైఫల్యమే అని విమర్శించారు. తమ అమ్మాయి కనిపించడంలేదని తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినప్పుడు అక్కడ పోలీసులు ఏంచేస్తున్నారు? ప్రభుత్వం ఏం చేస్తోంది? అని ప్రశ్నించారు. ఆరు రోజుల క్రితం ఫిర్యాదు వచ్చినా సరే ఎందుకు పట్టించుకోలేదు? రాష్ట్రంలో కేసుల దర్యాప్తు మీద, నేరాల అదుపుమీద అసలు దృష్టి ఉందా? అని నిలదీశారు. కేవలం రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు, డైవర్షన్ పాలిటిక్స్ తప్ప.. ఈ ప్రభుత్వానికి ప్రజల రక్షణపట్ల బాధ్యత అనేది ఉందా? అని ప్రశ్నించారు. తన్మయి హత్యా ఘటనకు ముఖ్యమంత్రి, ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
అసలేం జరిగింది?
అనంతపురం జిల్లా కేంద్రానికి చెందిన తన్మయి ఆకుతోటపల్లి వద్ద గల రామకృష్ణ కాలేజీలో ఇంటర్ సెకండియర్ చదువుతోంది. ఈ నెల 3వ తేదీన ఆమె ఇంటి నుంచి బయటకు వెళ్లింది. రాత్రి 9 గంటల సమయంలో కడుపు నొప్పిగా ఉందని కూల్‌డ్రింక్ తాగడానికి అని బయటకు వెళ్లి తిరిగిరాలేదు. దీంతో కంగారుపడిపోయిన తల్లిదండ్రులు పరిసర ప్రాంతాల్లో వెతికారు. తెలిసినవాళ్లు, బంధువులను అడిగినప్పటికీ లాభం లేకపోవడంతో ఈ నెల 4వ తేదీన స్థానిక పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తుండగానే కూడేరు మండల పరిధిలోని ఎన్సీసీ నగర్ సమీపాన ఉన్న ముళ్ల పొదల్లో గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది.
గుర్తించలేని విధంగా ముఖం కాలిపోయి, ఉబ్బిపోయి ఉండటంతో పాటు శరీరంపై కాలిన గుర్తులు ఉన్నాయి. దీంతో ఆమెను ఉద్దేశపూర్వకంగా హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమనిస్తున్నారు. తన్మయిపై దాడి చేసి, పెట్రోలు పోసి కాల్చి చంపి.. అనంతరం మృతదేహాన్ని మణిపాల్ స్కూల్ వెనుక పడేసినట్లు భావిస్తున్నారు. పోలీసుల సమాచారంతో అక్కడికి వెళ్లిన తల్లిదండ్రులు ఆ మృతదేహం తమ కుమార్తెదేనని నిర్ధారించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు.