Chandrababu | ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu) మరోసారి స్పందించారు. గతంలో ఎన్నో ఎన్నికలు చూశామని.. కానీ ఈసారి ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇచ్చారని సంతోషం వ్యక్తం చేశారు. ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు బుధవారం ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
‘దేశ చరిత్రలో 93 శాతం విజయం లేదు. కేంద్ర ప్రముఖుల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశాం. పేదరికం లేని సమాజం కోసం కృషి చేస్తా. ప్రజా పాలన ప్రారంభమైంది. ప్రక్షాళన తిరుమల నుంచే ప్రారంభం కావాలి. ప్రసాదాలు, తిరుమల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టితో చర్యలు తీసుకుంటాం. రాష్ట్ర ప్రజలందరికీ మంచి చేయడమే లక్ష్యం. అభివృద్ధిలో ప్రభుత్వంతో పాటు ప్రజలూ మమేకం కావాలి. నష్టపోయిన, ఇబ్బంది పడిన వర్గాలను పునరుద్ధరించాలి. రాజధాని అమరావతి, పోలవరం పడకేశాయి. వాటిని పూర్తి చేయడమే లక్ష్యంగా పనిచేస్తాను. కక్ష సాధింపులు ఉండవు. టీటీడీని ప్రపంచంలోనే ఉత్తమంగా తీర్చిదిద్దుతాం. ప్రపంచ వ్యాప్తంగా శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాల నిర్మాణానికి చర్యలు తీసుకుంటాం’ అని చంద్రబాబు తెలిపారు.
అలిపిరి వద్ద క్లైమోర్ మైన్స్ దాడి జరిగినప్పుడు ప్రాణాలతో బయటపడినట్లు ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. అప్పుడు వేంకటేశ్వర స్వామే తనను కాపాడారన్నారు. రాష్ట్రానికి, తెలుగు జాతికి తాను చేయాల్సింది గుర్తించి స్వామి ప్రాణభిక్ష పెట్టారన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను పేదరికం లేని రాష్ట్రంగా మార్చాలన్నారు. ప్రపంచంలో తెలుగుజాతి అత్యున్నత స్థాయిలో ఉండాలని ఈ సందర్భంగా చంద్రబాబు ఆకాంక్షించారు.
Also Read..
No Admissions | సర్కారు బడిలో అడ్మిషన్స్ ఫుల్.. ప్రవేశాల కోసం ఎంట్రెన్స్ టెస్ట్
Group-1 Prelims | గ్రూప్-1 ప్రిలిమ్స్ ప్రాథమిక కీ విడుదల.. 17 వరకు వెబ్సైట్లో..
Pema Khandu | వరుసగా మూడోసారి.. అరుణాచల్ ముఖ్యమంత్రిగా పెమా ఖండూ ప్రమాణ స్వీకారం