Margani Bharat | దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దని తిరుమల లడ్డూలో కల్తీ అంశంపై ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు తలంటు అంటిన నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబుపై మాజీ ఎంపీ మార్గాని భరత్ కీలక వ్యాఖ్యలు చేశారు. హిందూ సమజానికి చంద్రబాబు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఈ రకంగా మాట్లాడితే పారదర్శకత ఏముంటుందని ప్రశ్నించారు.
తూర్పు గోదావరి జిల్లా వైసీపీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మార్గాని భరత్ మాట్లాడారు. తిరుమల లడ్డూ వివాదంపై వైఎస్ జగన్ ఏయే అంశాల గురించి మాట్లాడారో అవే అంశాలను సుప్రీంకోర్టు ప్రస్తావించిందని గుర్తుచేశారు. చివరకు సత్యమే గెలుస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. శ్రీవారి లడ్డూపై చంద్రబాబు చేసిన ఆరోపణలపై హిందూ సమాజానికి భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
పోలవరం డయాఫ్రం వాల్‌పై జగన్ ప్రభుత్వం చేసిన ఆరోపణలపైనా మార్గాని భరత్ స్పందించారు. డయాఫ్రం వాల్ చిన్నాభిన్నం కావడానికి చంద్రబాబు కారణం కాదా? అని ప్రశ్నించారు. ఈసీఆర్ఎఫ్ కింద ఉన్న ఫౌండేషన్ అయిన డయాఫ్రం వాల్‌కు రక్షణ లేకపోవడంతో దెబ్బతిన్నదని అని ఆరోపించారు. ఏరకమైన రక్షణ లేకపోవడం వల్లే కాపర్ డ్యాం నిర్మాణం దెబ్బతిన్నదని పోలవరానికి సంబంధించి ఏర్పాటు చేసిన అంతర్జాతీయ కమిటీ తేల్చిందని చెప్పారు. కాపర్ డ్యామ్‌లు కట్టకుండా డయాఫ్రం వాల్ ఎందుకు కట్టారని ప్రశ్నించారు.
చంద్రబాబు పోలవరం ద్రోహి అని పిలవాలని మార్గాని భరత్ అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు చేటు చేసిన వ్యక్తిని తెలుగు ప్రజల ద్రోహి అని ఎందుకు అనకూడదని ప్రశ్నించారు. రాష్ట్రానికి ఇంతటి అనర్థం చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యాడని, పోలవరానికి సంబంధించి చంద్రబాబు చేయని తప్పంటూ లేదని ఘాటుగా విమర్శించారు.