AP News | జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు 10 లక్ష్యాలను నిర్దేశించారు. వినూత్న ఆలోచనలు, కార్యాచరణతో వాటిని సాకారం చేయాలని సూచించారు. రెండు రోజుల కలెక్టర్ల సదస్సు ముగింపు సందర్భంగా మంగళవారం నాడు కలెక్టర్లు, ఎస్పీలకు దిశా నిర్దేశం చేశారు.
– జీఎస్పీడీపీలో ఏటా 15 శాతం వృద్ధి రేటు సాధించాలి
– ఎక్కువ మందికి ఉద్యోగవకాశాలు కల్పించడంపై దృష్టి పెట్టాలి. ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్తను అభివృద్ధి చేయాలన్నది లక్ష్యం. నైపుణ్యం పోర్టల్ ద్వారా శిక్షణనిస్తూ, వర్క్ ఫ్రమ్ హోం వంటి విధానాలతో ఈ లక్ష్యాలను సాధించాలి
– మీరు పనిచేయడంతో పాటు టెక్నాలజీని వాడుకుంటూ క్షేత్రస్థాయి వరకు అందరితోనూ పనిచేయించాలి.
– క్రైమ్ రేటును ఈ ఏడాది 33 శాతం వరకు తగ్గించాలి.
– గ్రీన్ ఎనర్జీకి ప్రాధాన్యం ఇవ్వాలి. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సోలార్ ప్యానళ్లు ఏర్పాటు చేయాలి. అన్ని కార్యాలయాల్లో ఎలక్ట్రిక్ వాహనాలే ఉండాలి.
– సర్క్యులర్ ఎకానమీకి ప్రాధాన్యత ఇవ్వాలి. పోలీస్ వ్యవస్థ కూడా ఇందులో భాగస్వామ్యం అవ్వాలి. అన్ని ప్రభుత్వ ఆఫీసుల్లో క్లీన్ అండ్ గ్రీన్‌ను సంప్రదాయంగా తీసుకురావాలి.
– రోడ్లు, హైవేలు, రైల్వేలు, పోర్టులు, విమానాశ్రయాలు పెద్ద ఎత్తున అభివృద్ది చేసి, లాజిస్టిక్స్ ఖర్చు తగ్గించేందుకు కృషి చేస్తున్నాం. వాటిని వేగంగా జరిగేలా కలెక్టర్లు బాధ్యత తీసుకోవాలి.
– పెట్టుబడులు రావాలంటే ప్రభుత్వ విధానాలు బాగుంటే సరిపోదని.. ఎయిర్‌పోర్టుల వంటి మౌలిక వసతుల ప్రాజెక్టుల్లో పీపీపీ విధానంలో పెట్టుబడులు రావాలి. దీనికోసం వేగంగా అనుమతులివ్వడంతో పాటు శాంతి భద్రతలు సవ్యంగా ఉండాలని సూచించారు.
– సంక్షేమ పథకాలను నిరాఘాటంగా క్షేత్రస్థాయికి చేరాలి.
– అధికారులు ఆరోగ్యంగా ఉంటేనే రాష్ట్రం ఆరోగ్యంగా ఉంటుంది. పోలీసులతో పాటు ఇక్కడున్న ప్రతి ఒక్కరూ రోజూ గంటపాటు వ్యాయామం చేయాలి. పోలీసుల్లోనూ కొందరు వ్యాయమం మరిచిపోయారు. కష్టంగా పనిచేయొద్దు. స్మార్ట్ వర్క్ చేయండి
సరైన వ్యక్తుల్ని, సరైన స్థానాల్లో నియమిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. కలెక్టర్లు, ఎస్పీలతో ఆ ప్రక్రియ మొదలైందని తెలిపారు. బుధ, గురువారాల్లో సీనియర్ అధికారుల బదిలీలు ఉంటాయని పేర్కొన్నారు. సరైన స్థానాల్లో వారిని కూర్చోబెడతామని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరికీ జవాబుదారీతనం నిర్దేశించి, బాగా పనిచేసే వారిని ప్రోత్సహిస్తామన్నారు.