Chandrababu | గత ప్రభుత్వం ఆర్థిక ఉగ్రవాదాన్ని సృష్టించిందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. వారు సంపద సృష్టించే ఒక్క పని కూడా చేయలేదని.. పెట్టుబడులు పెట్టేందుకు వస్తే తరిమేశారని ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చేసరికి రాష్ట్రం వెంటిలేటర్‌పై ఉందని అన్నారు. బడ్జెట్‌పై ఏపీ శాసనసభలో శుక్రవారం చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని వ్యవస్థలను గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.
తన దగ్గర డబ్బులు లేవు కానీ.. నూతన ఆలోచనలు ఉన్నాయని సీఎం చంద్రబాబు అన్నారు. ఆ నూతన ఆలోచనలతో సంపద సృష్టించి, పేదలకు పంచుతానని తెలిపారు. గత ఐదేళ్లలో వినూత్న రీతిలో దోపిడీ చేశారని ఆరోపించారు. వాళ్ల దోపిడీ కొనసాగించేందుకు వ్యవస్థలను కూడా నాశనం చేశారని అన్నారు. వైసీపీ చేసిన తప్పులు, అప్పులు రాష్ట్రానికి శాపంగా మారాయని మండిపడ్డారు. స్కామ్‌ల కోసమే స్కీమ్‌లను అమలు చేశారని విమర్శించారు. అమరావతి గొప్ప నగరంగా తయారుకాకుండా ఐదేళ్లు అడ్డుకున్నారని అన్నారు. రాష్ట్ర జీవనాడి పోలవరాన్ని దెబ్బతీశారని అన్నారు. నదుల అనుసంధానం పూర్తయితే రాష్ట్రంలో కరవు అనేదే ఉండదని స్పష్టం చేశారు.
కన్నతల్లి శీలాన్ని శంకించేలా పోస్టులు పెట్టించారని ఏపీ సీఎం చంద్రబాబు మండిపడ్డారు. ఆడబిడ్డలను కించపరిచేలా పోస్టులు పెడితే ఉపేక్షించమని హెచ్చరించారు. మహిళలను కించపరిచేలా కూటమి నేతలు ఎవరూ పోస్టులు పెట్టరని.. పెట్టించబోరని తెలిపారు. ఒకవేళ అదే జరిగితే సొంతవాళ్లు అని కూడా చూడకుండా కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు.