Chandrababu | పులివెందుల జడ్పీటీసీ స్థానానికి నిర్వహించిన ఉప ఎన్నికను రద్దుచేసి, రీపోలింగ్ జరిపించాలన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ డిమాండ్‌పై ఏపీ సీఎం చంద్రబాబు ఘాటుగా స్పందించారు. వైఎస్ హయాం నుంచి పులివెందులలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగలేదని.. ఈసారి అరాచకాలు జరగలేదనే జగన్ అసహనంలో ఉన్నారని విమర్శించారు. ఆయన వైఖరి ఎలాంటిదో ప్రజలకు తెలిసిందే అని వ్యాఖ్యానించారు.
టీడీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ప్రజల నుంచి సీఎం చంద్రబాబు వినతులు స్వీకరించారు. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలపై మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. పులివెందుల ప్రజలు ఇప్పుడిప్పుడే అరాచకాల నుంచి బయటపడుతున్నారని తెలిపారు. ఇక్కడ నామినేషన్ వేసేందుకు భయపడే పరిస్థితి నుంచి 11 మంది పోటీ చేశారని పేర్కొన్నారు. రెండు పోలింగ్ బూత్‌ల్లో ఎప్పుడైనా రీపోలింగ్ జరిగిందా అని ప్రశ్నించారు. శాంతి భద్రతలు పటిష్టంగా ఉన్నాయి కాబట్టే ప్రజలు ధైర్యంగా ఓటేశారని తెలిపారు.
భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండండి
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. బుధవారం సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమీక్షకు మంత్రులు వంగలపూడి అనిత, నిమ్మల రామానాయుడు, సీఎస్ విజయానంద్ తదితరులు హాజరయ్యారు. విపత్తు నిర్వహణ, వ్యవసాయం, జలవనరుల శాఖ ఉన్నతాధికారులు కూడా ఈ అత్యవసర సమీక్షలో పాల్గొన్నారు. వాతావరణ శాఖ సూచనల మేరకు రాగల రెండు మూడు రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అప్రమత్తత చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు.
కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో వాగులు వంకల నుంచి వచ్చే ఆకస్మిక వరద ప్రవాహాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ దిగువన ఉన్న ప్రాంతాలకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ప్రస్తుతం కృష్ణా నదిలో రేపటికల్లా 5 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చే అవకాశం ఉందని అధికారులు సీఎంకు వివరించారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ నుంచి 3.09 లక్షల క్యూసెక్కుల నీరు 35 గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నామని తెలిపారు. కాలువలకు 5 వేల క్యూసెక్కుల మేర నీరు విడిచిపెట్టినట్టు అధికారులు సీఎంకు తెలిపారు. దీనిపై స్పందించిన సీఎం ప్రకాశం బ్యారేజికి దిగువన ఉన్న ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేయాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. మరోవైపు ఎగువన నాగార్జునసాగర్, పులిచింతల గేట్లను కూడా ఎత్తినట్టు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో రోడ్లు, లోతట్టు ప్రాంతాల్లో నిలిచిన నీటిని తక్షణం తొలగించేందుకు చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు.
గండ్లు పడకుండా గట్లు పటిష్ట పర్చాలి
మరోవైపు భారీవర్షం కారణంగా కొండవీటి వాగు, పాల వాగులకు వస్తున్న నీటిని కృష్ణా నదిలోకి నాలుగు పంపుల ద్వారా నీటిని ఎత్తి పోస్తున్నామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. వర్షకాల సీజన్ లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కాలువల్లో నీటి ప్రవాహాలు సక్రమంగా వెళ్లేందుకు వీలుగా గుర్రపు డెక్క, తూడును తొలగించాలని ముఖ్యమంత్రి జలవనరులశాఖ అధికారులను ఆదేశించారు. యుద్ధ ప్రాతిపదికన ఈ పనులు చేపట్టాలని స్పష్టం చేశారు. అలాగే కాలువలు, చెరువులకు గండ్లు పడకుండా గట్లను పటిష్టం చేయాలని సీఎం సూచించారు. జిల్లాల్లో వర్షాల పరిస్థితిపై ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్లు కూడా అప్రమత్తంగా ఉండి రైతులకు తక్షణ సమాచారం ఇవ్వాలని సీఎం ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో భూగర్భ జలాలను రీఛార్జి చేసేలా నిర్మాణాలను చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. పంచాయతీరాజ్, అటవీశాఖ అధికారులు ఆయా ట్రెంచ్ లను ఎక్కడెక్కడ చేపట్టాలో ప్రణాళిక చేసుకోవాలన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఈ ట్రెంచ్ లను తవ్వేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు.