Chandrababu | ఏపీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. గత ఐదేళ్లలో వచ్చిన డబ్బును ఏం చేశారో తెలియడం లేదని అన్నారు. తెచ్చిన అప్పులను ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెడితే ఆదాయం పెరగదని చెప్పారు. గతంలో చేసిన అప్పులకు వడ్డీ కట్టడం కూడా ప్రస్తుతం కష్టంగా ఉందని వెల్లడించారు.
2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నీతి ఆయోగ్ ఇచ్చినరిపోర్టుపై చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోతే ప్రజలపై పన్నుల భారం పడుతుందని తెలిపారు. రాష్ట్ర, దేశ భవిష్యత్ కోసం అందరూ ఆలోచించాలని సూచించారు.
నీతి ఆయోగ్ తయారు చేసిన రిపోర్ట్ లో గత 5 ఏళ్ళలో రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి పై క్లారిటీ ఇచ్చారు. అప్పులు చేసి తిరిగి చెల్లించే శక్తి మన రాష్ట్రానికి లేదు. గత ప్రభుత్వం ప్రభుత్వ కార్యాలయాలు తాకట్టు పెట్టింది. #ChandrababuNaidu #AndhraPradesh pic.twitter.com/WdrUVjcY9M
— Telugu Desam Party (@JaiTDP) January 27, 2025
అభివృద్ధి పనుల వల్లే సంపద పెరుగుతుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అలాగని అప్పులు చేసి.. పనులు చేస్తే ఇబ్బందులు పెరుగుతాయని తెలిపారు. అప్పులు చేసి తిరిగి చెల్లించే శక్తి మన రాష్ట్రానికి లేదని పేర్కొన్నారు. అందుకే గత వైసీపీ ప్రభుత్వం ప్రభుత్వ కార్యాలయాలను తాకట్టు పెట్టిందని తెలిపారు. గత ఐదేళ్లలో వచ్చిన డబ్బును ఏం చేశారో తెలియడం లేదని అన్నారు. తెచ్చిన అప్పులను ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెడితే ఆదాయం పెరగదని చెప్పారు. గతంలో చేసిన అప్పులకు వడ్డీ కట్టడం కూడా ప్రస్తుతం కష్టంగా ఉందని వెల్లడించారు.
2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.67వేల కోట్ల అప్పులు తీసుకొచ్చారని.. కానీ ఆ రుణాలను కనీస స్థాయిలో కూడా అభివృద్ధి ప్రాజెక్టులకు వినియోగించలేదని చంద్రబాబు నాయుడు తెలిపారు. వచ్చిన డబ్బులతో వైసీపీ దుబారా ఖర్చులు చేసిందని ఆరోపించారు.గత ఏడాదిలో రాష్ట్ర ఆదాయం 17.1 శాతం నుంచి 9.8 శాతానికి తగ్గిపోయిందని తెలిపారు. అప్పులు 16.5 శాతం మేర పెరిగాయని.. వడ్డీ కట్టే మొత్తం కూడా 15 శాతం పెరిగిందని చెప్పారు. వైసీపీ హయాంలో ఎక్కువ వడ్డీకి అప్పులు తీసుకురావడం, మూలధన వ్యయం లేకపోవడం, పన్నులు పెంచడం వంటి వివిధ అంశాల వల్ల ఏపీ అప్పుల ఊబిలో కూరుకుపోయిందని అన్నారు.
గత ప్రభుత్వ దుష్పరిపాలన, అవినీతి అక్రమాలపై వాస్తవాలు ప్రజలకు తెలియాలి. విశాఖ ఉక్కు, అమరావతి, పోలవరానికి కేంద్రం నిధులు ఇచ్చింది. కేంద్రం ఇచ్చిన నిధులను మళ్లించలేను. డబ్బులు ఉంటే.. పథకాల అమలుకు క్షణం కూడా ఆలోచించను. మాట తప్పడం ఇష్టంలేక ప్రజలకు వాస్తవం చెబుతున్నా. అప్పు చేసి అయినా… pic.twitter.com/IdBxwPb9qf
— Telugu Desam Party (@JaiTDP) January 27, 2025
తాము ఊహించిన దానికంటే రాష్ట్రంలో ఎక్కువ విధ్వంసం జరిగిందని చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగిందని అన్నారు. తాము చెప్పిందే ఇప్పుడు నీతి ఆయోగ్ ధృవీకరించిందని తెలిపారు. వృద్ధిరేటు సాధిస్తే.. ఆదాయం పెరిగి, అప్పులు తగ్గించుకునే పరిస్థితి వస్తుందని అన్నారు. ఎక్కువ వడ్డీకి అప్పులు తీసుకొచ్చారు కాబట్టి.. డెబ్ట్ రీషెడ్యూల్కు వెళ్తున్నామని వెల్లడించారు. ఆర్థిక రంగంలో సుస్థిరత వస్తేనే రాష్ట్రం గాడిన పడుతుందని అన్నారు. వైసీపీ హయాంలో తలసరి ఆదాయం పెరగలేదు కానీ.. తలసరి అప్పు మాత్రం పెరిగిందని విమర్శించారు. గాడిన పెట్టడానికి కొంచెం ఆలస్యమవుతుందని.. ప్రజలు ఆర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.