Chandrababu | ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే ఛీఛీ అనేవాళ్లు.. ఇప్పుడు భలే భలే అంటున్నారని అని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. గూగుల్ వంటి సంస్థలు ఏపీకి వస్తున్నాయని.. చదువుకున్న పిల్లలు ఒకప్పుడు అమెరికా వెళ్లేవాళ్లని.. ఇప్పుడు ఇక్కడే వ్యాపారాలు చేయాలనే ఆలోచన చేస్తున్నారని అన్నారు. ప్రకాశం జిల్లా పీసీపల్లి మండలం లింగన్నపాలెంలో ఇవాళ చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోదీ, పవన్ కల్యాణ్, నేను కలిసి కూటమి ఏర్పాటు చేశామని తెలిపారు. దీనివల్ల కేంద్రం తీసుకొచ్చే పాలసీలను నేరుగా రాష్ట్రానికి తీసుకొస్తున్నానని పేర్కొన్నారు. ఇందుకోసం పవన్ కల్యాణ్ బాగా మద్దతు ఇస్తున్నారని.. లోకేశ్ కూడా పట్టువదలని విక్రమార్కుడిలా పనిచేస్తున్నాడని చెప్పారు.
ప్రతి ఇంటికో పారిశ్రామికవేత్త ఉండాలన్నదే తమ లక్ష్యమని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. చదువుకుంటున్న విద్యార్థులకు చదువు పూర్తయ్యేలోపు స్థానికంగా ఉపాధి కల్పించే బాధ్యత తనది అని స్పష్టం చేశారు. 1987 ప్రాంతాల్లో అందరికీ ఉద్యోగాలు ఇస్తామని కొంతమంది రాజకీయ నేతలు చెప్పేవారని.. కానీ తాను మాత్రం ఇంటికొక వ్యాపారవేత్తను తయారుచేస్తానని హామీ ఇచ్చానని చెప్పారు. రాష్ట్రాభివృద్ధిలో ప్రజలను భాగస్వామ్యులను చేస్తున్నామని పేర్కొన్నారు. రాజధాని కోసం 29 వేల మంది రైతులు 33 వేల ఎకరాలు ఇచ్చారని అన్నారు. వారు ఇచ్చిన భూమిని అభివృద్ధి చేసి వారికి అప్పగిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలోని వనరులను సద్వినియోగం చేసేకోవాలని సూచించారు. ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్టు నిర్మిస్తామని తెలిపారు. ఇప్పటికే రాష్ట్రానికి అనేక పెట్టుబడులు తీసుకొచ్చామని.. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనతో ఏపీ బ్రాండ్‌ను మళ్లీ తీసుకొస్తున్నామని స్పష్టం చేశారు. పెట్టబడులు తీసుకొచ్చి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నామని అన్నారు. 20 లక్షల ఉద్యోగాలు అంటే చాలామంది అవహేళన చేశారని.. కానీ ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఇప్పటికే చాలా కంపెనీలు ముందుకొచ్చాయని తెలిపారు. ఈ వారమంతా పెట్టుబడుల వెల్లువ కొనసాగుతుందని చెప్పారు. పెట్టుబడులతో ఉద్యోగవకాశాలు పెరుగుతాయని అన్నారు.
గత వైసీపీ పాలనలో పారిశ్రామికవేత్తలను బెదిరించడంతో వారు పారిపోయారని చంద్రబాబు నాయుడు అన్నారు. జగన్ హయాంలో విధ్వంస విధానాలతో పరిశ్రమలు వెనక్కి వెళ్లాయని ఆరోపించారు. ప్రజావేదిక కూల్చడంతో విధ్వంసం రాష్ట్రవ్యాప్తంగా జరిగిందని అన్నారు. 17 నెలల నుంచి భిన్నమైన పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం ఏపీలో పనిచేస్తుందని తెలిపారు. చాలా సుడిగుండాల నడుమ తాము పనిచేస్తున్నామని పేర్కొన్నారు. భవిష్యత్తు టెక్నాలజీది అని.. 35 ఏళ్ల క్రితం తాను చెబితే అంతా అవహేళన చేశారని అన్నారు. కానీ 25 ఏళ్ల క్రితం తాను అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తే హైదరాబాద్ దేశానికే ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. ఇప్పుడు ఏపీ అభివృద్ధి కోసం అమరావతికి క్వాంటమ్ కంప్యూటర్స్ తీసుకొచ్చామని తెలిపారు. ఇది వచ్చే జనవరిలో ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. జపాన్, అమెరికా సరసన మనం చేరబోతున్నామని వ్యాఖ్యానించారు.