AP News | నరసాపురం ఎంపీడీవో వెంకటరమణారావు మిస్సింగ్ మిస్టరీ ఇంకా వీడలేదు. సూసైడ్ చేసుకుంటున్నానని మెసేజ్ చేసి కనిపించకుండాపోయి ఇన్ని రోజులు అవుతున్నా ఆయన ఆచూకీని కనిపెట్టలేకపోయారు. దీంతో గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్నకు చెందిన ఐదు బృందాలతో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. విజయవాడ నుంచి ఏలూరు వరకు ఉన్న కాలువలో విస్తృతంగా గాలిస్తున్నారు.
ఐదు రోజుల నుంచి ఎంపీడీవో వెంకటరమణారావు ఆచూకీ దొరక్కపోవడంతో ఆయన కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో వారికి ఏపీ సీఎం చంద్రబాబు ఫోన్ చేసి ధైర్యం చెప్పారు. నిజాయితీపరుడు, సమర్థుడైన అధికారి ఆచూకీ లేకుండాపోవడంపై విచారం వ్యక్తం చేశారు. రమణారావు చివరగా ఇంటి నుంచి వెళ్లేటప్పుడు ఏం చెప్పారు? ఆయన ఒత్తిడికి గురవ్వడానికి గల కారణాలేంటి? అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. దీనిపై పూర్తి దర్యాప్తు చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా చంద్రబాబు హామీ ఇచ్చారు.
విజయవాడ సమీపంలోని కానూరు మహాదేవపురం కాలనీలో మండవ వెంకట రమణరావు నివాసం ఉంటున్నాడు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఎంపీడీవోగా పనిచేస్తున్నారు. ఈ నెల 3వ తేదీ నుంచి సెలవు పెట్టిన ఆయన.. ఇటీవల కానూరులోని ఇంటికి వచ్చారు. 15వ తేదీన మచిలీపట్నంలో పని ఉందని చెప్పి ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయాడు. రాత్రి 10 గంటలకు ఫోన్ చేసి తాను మచిలీపట్నంలో ఉన్నానని.. ఇంటికి రావడానికి ఆలస్యమవుతుందని చెప్పాడు. అర్ధరాత్రి దాటాక కుమారుడికి ఒక మెసేజ్ చేశాడు. నా పుట్టిన రోజైన 16వ తేదీనే నా చావు రోజు కూడా.. అందరూ జాగ్రత్త అని మెసేజ్ చేశాడు.
అలాగే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు రాసిన సూసైడ్ నోట్‌ను కూడా తన సెల్‌ఫోన్ నుంచి కుటుంబసభ్యులకు పంపించారు. అందులో వైసీపీ ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ ప్రసాదరాజుపై తీవ్ర ఆరోపణలు చేశారు. నరసాపురంలో ఫెర్రీ లీజుకు సంబంధించి ప్రసాదరాజు అండదండలతో కాంట్రాక్టర్ రెడ్డప్ప ధవేజీ చేస్తున్న బెదిరింపులు తట్టుకోలేకపోతున్నానని.. తనకు న్యాయం చేయాలని అందులో పేర్కొన్నారు. ఇది చూసి ఆందోళన చెందిన కుటుంబసభ్యులు పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎంపీడీవో కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
తనపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఫెర్రీ కాంట్రాక్టర్ రెడ్డప్ప ధవేజీ కూడా స్పందించారు. ప్రభుత్వానికి తాను రూ.50 లక్షలు బాకీ ఉన్న మాట నిజమేనని తెలిపారు. దానికి సంబంధించి గ్యారంటీ నిమిత్తం ప్రభుత్వానికి కొన్ని డాక్యుమెంట్లను సమర్పించానని.. వాటి విలువ బాకీ మొత్తం కంటే కూడా ఎక్కువే అని చెప్పారు. దీని ప్రకారం చూసుకుంటే.. తనకే ప్రభుత్వం నంచి డబ్బులు వస్తాయని అన్నారు. ఈ వ్యవహారంతో ప్రసాదరాజుకు ఎలాంటి సంబంధం లేదని.. అనవసరంగా ఆయన్ను ఇందులోకి లాగుతున్నారని అన్నారు.