Chandrababu | ఏపీ సీఎం, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అమరావతిలో సొంతింటి నిర్మాణానికి సిద్ధమయ్యారు. ఉండవల్లిలోని కరకట్టపై ఇప్పటికే చంద్రబాబుకు ఒక ఇల్లు ఉంది. అయితే వరదలు వచ్చిన ప్రతిసారి అది మునిగిపోతూ వస్తోంది. దీంతో అమరావతిలో మరో ఇంటిని నిర్మించుకోవాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే వెలగపూడి సచివాలయం వెనుక ఈ9 రహదారి పక్కనే ఇంటి నిర్మాణం చేపట్టారు. బుధవారం నాడు ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేశారు.
వెలగపూడి రెవెన్యూ పరిధిలోని సచివాలయం వెనుక, ఎమ్మెల్యే క్వార్టర్ల సమీపంలో ఐదెకరాల విస్తీర్ణంలోని నివాస ఫ్లాట్‌ను అదే గ్రామానికి చెందిన ఓ రైతు కుటుంబం నుంచి గత ఏడాది డిసెంబర్లో చంద్రబాబు కొనుగోలు చేశారు. ఆ ఫ్లాట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇటీవల పూర్తయ్యింది. దీంతో ఐదెకరాల స్థలంలోని 1455 చదరపు గజాలలో జీప్లస్ వన్ ఇంటిని నిర్మించనున్నారు. నిర్మాణ పనులను వీలైనంత తొందరగా పూర్తి చేసి ఏడాదిలోపు గృహప్రవేశం చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు.
బుధవారం నాడు జరిగిన గృహ శంకుస్థాపన మహోత్సవంలో కుటుంబసభ్యులు మినహా పార్టీ నేతలు ఎవరికీ ఆహ్వానం అందలేదు. అంతేకాదు.. ఆ స్థలం వైపు ఎవరూ వెళ్లకుండా అధికారులు ఏర్పాట్లు కూడా చేశారు. గ్రీన్ పరదాల మధ్య భూమి పూజ ముగిసింది.