Chandrababu | ఏపీలో ముంచెత్తిన వరదల తీవ్రతపై ఏపీ సీఎం చంద్రబాబు వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. సహాయక చర్యలపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలోనే మంత్రులు, కలెక్టర్లు, ఉన్నతాధికారులతో ఆయన బుధవారం నాడు టెలికాన్ఫరెన్స్లో సమీక్ష నిర్వహించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో విస్తృతంగా చర్యలు చేపట్టామని తెలిపారు. తక్కువ సమయంలోనే వరదల పరిస్థితులను సాధారణ స్థితికి తీసుకొచ్చామని చెప్పారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టి సాధారణ స్థితికి తీసుకొస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రతి ఇంటికి సాయం అందించాలని అన్నారు. వరదల్లో మృతి చెందిన వారిని గుర్తించాలని అధికారులకు సూచించారు. మృతదేహాలకు వారి కుటుంబాలకు అప్పగించాలని పేర్కొన్నారు. ఎవరూ ముందుకు రాకపోతే ప్రభుత్వం తరఫున అంత్యక్రియలు నిర్వహించాలని అన్నారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం అందజేయాలని సూచించారు.
వరద బాధితులకు ఇంటింటికీ వెళ్లి ఆహారం అందించాలని చంద్రబాబు అధికారులకు సూచించారు. ప్రతికుటుంబానికి నిత్యవసర సరుకులు అందించాలని పేర్కొన్నారు. ప్రతి కుటుంబానికి 25 కేజీల బియ్యం, లీటర్ పామాయిల్, 2 కేజీల ఉల్లిగడ్డలు, 2 కేజీల ఆలుగడ్డలు, కేజీ చక్కెర ఇవ్వాలన్నారు. మొబైల్ రైతుబజార్లు ఏర్పాటు చేసి తక్కువ ధరకు కూరగాయలు ఇవ్వాలని తెలిపారు. అంబులెన్స్లన్నీ పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచాలని సూచించారు. బ్లాక్ మార్కెటింగ్ లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నష్టాన్ని వివరించి కేంద్రం సాయం కోరుదామని అన్నారు. విద్యుత్ పునరుద్ధరణ వేగవంతం చేయాలని ఆదేశించారు. యుద్ధ ప్రాతిపదికన పారిశుధ్య పనులు చేపట్టాలన్నారు. పంట నష్టంపై అంచనాలు నమోదు చేయాలన్నారు.
కాగా, విజయవాడను మరోసారి వరద ముంచెత్తకుండా ఉండేందుకు ఏపీ ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తోంది. త్వరలోనే బుడమేరు వాటర్ డైవర్షన్ పనులు చేపడతామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. కొల్లేరు, కృష్ణా నదిలోకి బుడమేరు నీళ్లు కలిసేలా డైవర్షన్ ప్లాన్. మళ్లీ ఇలాంటి పరిస్థితి రాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. కృష్ణా నదిలో వరద ఉధృతి సగానికి పైగా తగ్గిందని తెలిపారు. ఈరోజు, రేపటికల్లా వరద మరింత తగ్గుతుందని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం నిర్వాకం వల్లే వరద కష్టాలు వచ్చాయని చంద్రబాబు ఆరోపించారు. ఆర్థిక విధ్వంసంతో పాటు అడ్మినిస్ట్రేషన్ను పూర్తిగా నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. వైసీపీ హయాంలోనే ప్రకాశం బ్యారేజి గేట్లు దెబ్బతిన్నాయని అన్నారు. మేమొచ్చి 80 రోజులే అయ్యింది.. గుర్తించేలోపే వరదలు వచ్చాయని వివరించారు. వైసీపీ నేతలు దుష్ప్రచారాలు మానుకోవాలని సూచించారు.