Chandrababu | సభలో ప్రతిపక్షం లేదు కదా.. మనకేం ఉందని నిర్లక్ష్యంగా ఉండొద్దని కూటమి ఎమ్మెల్యేలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. వాళ్లకు బాధ్యత లేదు కానీ.. మనకు ఉందని అన్నారు. అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్‌పై నిర్వహించిన వర్క్‌షాప్‌లో చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రజలకు జవాబుదారీగా పనిచేద్దామని సూచించారు.
ఎమ్మెల్యేలకు సబ్జెక్ట్ చేర్చుకోవాలనే ఆసక్తి తగ్గిపోతుందని చంద్రబాబు అన్నారు. ఎమ్మెల్యేలు నిరంతరం నేర్చుకోవాలని, తెలుసుకోవాలని సూచించారు. బడ్జెట్ సమావేశాలపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలని తెలిపారు. ప్రభుత్వం తెచ్చే బిల్లులు, పాలసీలపై అధ్యయనం చేయాలన్నారు. రాష్ట్రంతో పాటు కేంద్ర బడ్జెట్లోనూ నిధుల కేటాయింపులపై ఎమ్మెల్యేలు స్టడీ చేయాలని సూచించారు. పబ్లిక్ గవర్నెన్స్‌లో ఎమ్మెల్యేల భాగస్వామ్యం ఉండాలని చెప్పారు. విజన్ 2047పై అందరి అభిప్రాయాలు తెలియజేయాలని కోరారు. పనిచేయాలనే ఆసక్తి ఉంటేనే ఏదైనా సాధ్యమవుతుందని తెలిపారు.
ప్రజలకు ఏం అవసరం.. మనం ఏం చేశామనేది చెప్పడానికి అసెంబ్లీ ఒక వేదిక అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. అసెంబ్లీలో తమ ప్రతినిధి మాట్లాడుతున్నారని ప్రజలు గమనిస్తూనే ఉంటారని తెలిపారు. అలాంటప్పుడు బూతులు మాట్లాడితే ప్రజలు స్వాగతించరని చెప్పారు.