AP CM Chandrababu | పద్మభూషణ్ పురస్కారానికి ఎంపికైన తెలుగు సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు అభినందనలు తెలిపారు. ఎన్టీఆర్ వారసత్వాన్ని నిలబెడుతూ సినిమా, రాజకీయ రంగాల్లో రాణిస్తున్నారని పేర్కొన్నారు. బసవ తారకం క్యాన్సర్ దవాఖాన ద్వారా ప్రజా సంక్షేమానికి అంకిత భావంతో ఎంతో మందిని కాపాడుతున్నారని గుర్తు చేశారు. ఎంతో మంది జీవితాలకు స్ఫూర్తినిస్తున్న నిజమైన ఐకానిక్ నాయకుడికి తగిన గౌరవం లభించిందన్నారు.
సినీ నటుడు, బాలకృష్ణ మామయ్యకు పద్మభూషణ్ పురస్కారం లభించడం తమ కుటుంబానికి ఎంతో గర్వ కారణం అని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. సోషల్ మీడియా వేదిక ఎక్స్ ఖాతా వేదికగా బాలకృష్ణకు హృదయ పూర్వక అభినందనలు తెలిపారు. ‘బ్లాక్ బస్టర్ హిట్ సినిమాల నుంచి లక్షలాది మందికి స్ఫూర్తినివ్వడంతోపాటు సినిమా, రాజకీయ, ఆరోగ్య సంరక్షణకు ముందుకు సాగుతున్న సుదీర్ఘ ప్రయాణంలో మీ విశేషమైన సేవలకు ఈ అవార్డు నిదర్శనం. మీ విజయాలను గుర్తించినందుకు సంతోషం’ అని లోకేశ్ ట్వీట్ చేశారు.
ప్రతిష్టాత్మక పద్మభూషణ్ అవార్డు అందుకున్న బాలయ్య బాబాయికి హృదయపూర్వక అభినందనలు అని సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. ‘సినిమా రంగానికి మీరు చేసిన అసమాన సేవలు, మీ నిర్విరామ ప్రజాసేవకు ఈ గుర్తింపు నిదర్శనం’ అని ఎన్టీఆర్ పేర్కొన్నారు.