Cyclone Montha | బంగాళాఖాతంలో తుపాన్ ఏర్పడనున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. మొంథా తుపాన్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని యంత్రాంగాన్ని ఆదేశించింది. ఈ నెల 27, 28, 29వ తేదీల్లో తీర ప్రాంత జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో తుపాన్ పరిస్థితులపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తీర ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు. రోడ్లు, చెరువులు, కాలువ గట్లు కోతకు గురైతే తక్షణ మరమ్మతులు చేపట్టాలని సూచించారు.
విద్యుత్, టెలికాం, తాగునీటి సరఫరా వ్యవస్థకు ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగేలా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా 27 సెల్ టవర్లను డీజిల్ జనరేటర్లతో సిద్ధం చేశామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి అధికారులు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 851 జేసీబీలు, 757 క్రేన్లు అందుబాటులో ఉంచామన్నారు. ప్రజల ఆస్తి, ప్రాణ, మౌలిక సదుపాయాల రక్షణకు ప్రభుత్వ యంత్రాంగం బాధ్యత తీసుకోవాలని చంద్రబాబు నాయుడు సూచించారు. తుపాన్ తీవ్రతను బట్టి విద్యాసంస్థలకు కలెక్టర్లు సెలవులు ప్రకటించాలన్నారు. డ్రోన్ల ద్వారా సహాయక చర్యలు చేపట్టాలని, బోట్లను సముద్రంలోకి వెళ్లనివ్వరాదని సూచించారు. ఎస్ఎంఎస్ అలర్ట్స్, సోషల్‌మీడియా, ఐవీఆర్ఎస్ కాల్స్, వాట్సాప్ ద్వారా ప్రజలకు ముందస్తుగా హెచ్చరికలు పంపించాలని ఆదేశించారు. రిజర్వాయర్లు, ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో నీటి మట్టాలను నిరంతరం పర్యవేక్షించి అందుకు అనుగుణంగా కార్యాచరణ అమలు చేయాలని దిశానిర్దేశం చేశారు.
అమరావతి
బంగాళాఖాతంలో 24 గంటల్లో ఏర్పడనున్న తుపాన్ నేపథ్యంలో విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో హోం మంత్రి అనిత,స్పెషల్ సీఎస్ సాయిప్రసాద్, ఎండీ ప్రఖర్ జైన్, ప్రభుత్వ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు pic.twitter.com/mhBeVZEFXe
— Andhra Pradesh State Disaster Management Authority (@APSDMA) October 26, 2025
అంతకుముందు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో స్పెషల్ సీఎస్ సాయిప్రసాద్, ఎండీ ప్రఖర్ జైన్, ప్రభుత్వ అధికారులతో ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అనితకు తుపాన్ గమనాన్ని, తీవ్రతను, ప్రభావిత జిల్లాల వారీగా వివరాలను అధికారులు వివరించారు. తుపాన్ ముప్పు పొంచి ఉన్నందున అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి ఆదేశించారు. 27, 28, 29వ తేదీల్లో తీవ్రగాలులు, అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికల నేపథ్యంలో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని, మత్స్యకారులను సముద్రంలోకి వెళ్లకుండా చూడాలన్నారు