Shivaratri Brahmotsavam | శ్రీశైలం : శ్రీగిరి క్షేత్రంలో ఈ నెల 19 నుంచి మార్చి ఒకటో తేదీ వరకు మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగనున్నాయి. ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాలకు రావాలని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును శ్రీశైలం దేవస్థానం అధికారులు ఆహ్వానించారు. సీఎంను ఆయన నివాసంలో కలిసి బ్రహ్మోత్సవాల ఆహ్వానపత్రికను అందజేశారు. అనంతరం సీఎంను శేషవస్త్రంతో సత్కరించారు. ఆలయ పండితులు వేదాశీర్వచనం చేసి స్వామిఅమ్మవార్ల జ్ఞాపిక, తీర్థ ప్రసాదాలు అందజేశారు. సీఎంను కలిసిన వారిలో శ్రీశైలం నియోజకవర్గ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి, దేవస్థానం ఈవో శ్రీనివాసరావు, అర్చకులు, వేదపండితులు ఉన్నారు.