Amaravati | ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని అధికారికంగా ధ్రువీకరించే గెజిట్ బిల్లును త్వరలోనే పార్లమెంట్లో పెట్టనున్నారు. ఈ గెజిట్ ప్రక్రియ ముగింపు దశకు చేరుకుందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. త్వరలో జరిగే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో అమరావతి రాజధాని బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలిపారు. ప్రస్తుతం హోం శాఖలో ఫైల్ క్లియర్ అయ్యిందని.. న్యాయ శాఖలో పరిశీలనలో ఉందని సమాచారం.
అమరావతిలోని సీఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో పెమ్మసాని చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడుతూ.. రైతులకు ఇచ్చిన హామీల అమలులో భారీ పురోగతి సాధించామని తెలిపారు. ఇప్పటివరకు 98 శాతం మంది రైతులకు రిటర్న్ ప్లాట్ల పంపిణీ పూర్తయ్యిందని పేర్కొన్నారు. మిగిలిన రెండు శాతం సమస్యలను కూడా తొందరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అమరావతిని ప్రపంచస్థాయి రాజధానిగా తీర్చిదిద్దేందుకు దీర్ఘకాలిక మాస్టర్ ప్లాన్ను రూపొందిస్తున్నట్లు తెలిపారు. వచ్చే 15 ఏండ్లలో జనాభా పెరుగుదల, ఆర్థిక కార్యకలాపాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రవాణా, మౌలిక సదుపాయాలు, గ్రీన్ ఏరియాలను అభివృద్ధి చేస్తామని అన్నారు. ఇప్పటికే అనేక అంతర్జాతీయ సంస్థలు ఈ ప్రాజెక్టుపై ఆసక్తి చూపిస్తున్నాయని తెలిపారు.