AP Assembly Budget Session | ఏపీ అసెంబ్లీ సమావేశాలకు తేదీలు ఖరారయ్యాయి. ఈ నెల 24వ తేదీన అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. ఫిబ్రవరి 27వ తేదీన గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై అసెంబ్లీలో చర్చ జరుగుతుంది.
ఇక ఈ నెల 28వ తేదీన 2025-26వ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను ప్రవేశ పెట్టే అవకాశం ఉంది. ఇక బడ్జెట్ సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై కూటమి ప్రభుత్వం ఆలోచిస్తోంది. కనీసం 15 రోజులు అయినా సభ నిర్వహించాలని యోచిస్తోంది. బడ్జెట్ సమావేశాలు మొదలైన మొదటి రోజు నిర్వహించనున్న బీఏసీ సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. అసెంబ్లీ సమావేశాలకు మంత్రులు పూర్తి స్థాయి సబ్జెక్టుతో హాజరు కావాలని కూటమి ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది.
ఇదిలా ఉంటే ప్రతిపక్ష హోదా ఇవ్వకుంటే అసెంబ్లీ సమావేశాలకు వచ్చేది లేదని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. మాట్లాడటానికి సమయం ఇస్తేనే కదా అసెంబ్లీకి వెళ్లేది అని.. సాధారణ ఎమ్మెల్యేలాగా టైమ్ ఇస్తామంటే ఎలా అని ప్రశ్నించారు. ఎన్ని సీట్లు ఉన్నా ప్రతిపక్ష హోదా ఇవ్వాలని అడిగారు.