అమరావతి : డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ ( Konaseema) జిల్లాలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య ఏడుకు చేరుకుంది. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. జిల్లాలోని రాయవరం గణపతి గ్రాండ్ బాణసంచా( Fire Factory) తయారీ కేంద్రంలో పేలుడు (Explosion) చోటు చేసుకోగా ఒక్కసారిగా అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. ఈ అగ్నికీలల్లో చిక్కుకుని బుధవారం ఆరుగురు సజీవ దహనం కాగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం వివిధ ఆస్పత్రులకు తరలించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అగ్నిప్రమాదం సంభవించిన సమయంలో 40 మంది కార్మికులు పని చేస్తున్నారు. పేలుడు ధాటికి బాణాసంచా తయారీ కేంద్రం గోడ కుప్పకూలింది.