అమరావతి : వైసీపీ ప్రభుత్వ వైఖరితో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ను తిరిగి పునర్నిర్మాణానికి అందరూ కలిసి రావాలని టీడీపీ శ్రేణులకు టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ భవన్లో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. సమాజ హితం కోసం టీడీపీ అవసరముందని పేర్కొన్నారు. తటస్థులు, సామాన్యులు పార్టీలో చేరేందుకు ముందుకు రావాలని, ప్రభుత్వానికి భయపడితే తిరిగి కోలుకోలేనంతగా దెబ్బతింటామని అన్నారు.
పార్టీలో సీనియార్టీని గౌరవిస్తామని, సిన్సియార్టీని గుర్తిస్తామని వెల్లడించారు. పార్టీలో సీనియార్టీ ఉన్నా ఓట్లు వేయించలేని పరిస్థితి ఉంటే ఏం లాభమని అన్నారు. ఓట్లు వేయించలేని సీనియర్లకే ప్రాధానమిస్తే ప్రతిపక్షంలోనే ఉంటామని వివరించారు. 40 శాతం యువతకు సీట్లిద్దామన్న పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. పార్టీలో పనిచేసే యువ నేతలనూ గుర్తించి అవకాశాలిస్తామని స్పష్టం చేశారు .
టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ పార్టీలో ఏ పదవులు రావాలన్నా సభ్యత్వంతోనే ముడిపడి ఉందని అన్నారు. వాట్సాప్ ద్వారా సభ్యత్వాన్ని రూపొందించుకోవాలని ప్రణాళిక చేశామని నారా లోకేశ్ తెలిపారు. ఈ సమావేశంలో సీనియర్ నాయకులు కళా వెంకట్రావు, సోమిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.