Bifurcation Issues | హైదరాబాద్, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర విభజనకు సంబంధించిన పలు సమస్యల పరిష్కారంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైచేయి సాధించాలని చూస్తున్నది. తెలంగాణ సీఎంగా కేసీఆర్ ఉన్నప్పుడు కిమ్మనని ఏపీ.. ఇప్పుడు అన్ని అంశాలపై పట్టు బిగించేందుకు ప్రయత్నిస్తున్నది. ఉమ్మడి ఆస్తుల్లో వాటాలు, ఉద్యోగుల పంపిణీలో తలెత్తిన ప్రతిష్టంభన కొలిక్కిరాలేదు. ఇటీవల తెలంగాణ అధికారులు విజయవాడకు వెళ్లి ఏపీ ప్రభుత్వంతో జరిపిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. ఆ సమావేశంలో ఏపీ ప్రభుత్వం గతానికి భిన్నంగా తెలంగాణపై పైచేయి సాధించేందుకు ప్రయత్నించినట్టు తెలిసింది. గతంలో తెలంగాణ నుంచి వచ్చిన ప్రతిపాదనలపై ఏపీ అధికారులు కొంత వెనక్కి తగ్గేవారని, ఈ సారి ఏపీ అధికారులు అడుగడుగునా దబాయింపు ధోరణి ప్రదర్శించారని ఆ సమావేశానికి హాజరైన ఓ కీలక అధికారి వెల్లడించారు.
విద్యుత్తు సంస్థల విభజన, నిధుల పంపకంపై జరిగిన చర్చలో తెలంగాణకు ఇవ్వాల్సిన 20వేల కోట్లకుపైగా నిధుల గురించి ఏపీ మాట్లాడకుండా తనకు రావాల్సిన 3 వేల కోట్ల గురించి మాత్ర మే అడిగినట్టు తెలిపారు. ఆర్టీసీ ఆస్తుల విభజనను తేల్చని ఏపీ.. సింగరేణిలో వాటా లేకపోయినా పూర్తిస్థాయి వాటా కావాలని పట్టుపట్టినట్టు చెప్పారు. సింగరేణికి సంబంధించిన ‘ఆప్మెల్’ ఏపీకే కావాలని అడగడంతోపాటు దానిపై తెలంగాణకు హక్కు లేదన్నట్టుగా వాదించిందని, ఉద్యోగుల విభజన సందర్భంగా ఏపీకి కేటాయించిన వారిలో దాదాపు 1,400మంది తెలంగాణకు వచ్చేందుకు సిద్ధం గా ఉన్నట్టు చెప్పిందని తెలిపారు. వీరంతా గెజిటెడ్ పోస్టుల్లో ఉన్నవాళ్లేనని, ఒకవేళ వీరిని తీసుకుంటే తెలంగాణ వాళ్లకు పదోన్నతులు లభించవని స్పష్టంచేశారు. నాలుగో, మూడో తరగతి ఉద్యోగులతోపాటు నాన్-గెజిటెడ్ ఉద్యోగులకు సంబంధించి ఏపీ చేసిన ప్రతిపాదనలకు తెలంగాణ అధికారులు సానుకూలం గా స్పందించినప్పటికీ గెజిటెడ్ ఉద్యోగుల విషయం తేలలేదని తెలిసింది.