Daggubati Prasad | అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పేకాటను తీసేసి నాలుగున్నరేళ్లు అయ్యిందని ఆయన మండిపడ్డారు. సీఎం చంద్రబాబుతో మాట్లాడి అనంతపురంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న క్లబ్ల్లో పేకాట ఆడుకునేలా ఏర్పాట్లు చేస్తానని తెలిపారు. ఈ విషయంపై ఇప్పటికే జిల్లా కలెక్టర్, పాత ఎస్పీతో మాట్లాడటం జరిగిందని కూడా చెప్పారు.
అనంతపురంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ మాట్లాడుతూ.. పేకాట ఆడకపోవడం వల్ల మనిషి జీవిత కాలం తగ్గిపోయిందని తెలిపారు. కరోనా టైమ్లో పేకాట ఆడకపోవడం వల్ల 22 మంది రిటైర్డ్ ఉద్యోగులు మరణించారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే ప్రసాద్ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్గా మారింది.
మంచి మంచి కట్టుబాట్లు…
చంద్రబాబుతో మాట్లాడి పేకాట క్లబ్లు తెరిపిస్తా
– టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్#AndhraPradesh #SaveAPFromTDP pic.twitter.com/8iy7dDxFyN
— Jagananna Connects (@JaganannaCNCTS) July 30, 2024
2019 ఎన్నికల తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ జగన్ పేకాట క్లబ్బులను మూసివేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక బృందాలతో పేకాట శిబిరాలపై ఉక్కుపాదం మోపారు. రీక్రియేషన్ క్లబ్బుల పేరుతో జరుగుతున్న జూదాన్ని అణిచివేసేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. పేకాట, బెట్టింగ్ కారణంగా కుటుంబాలు చితికిపోతున్నాయని వాటిని అణిచివేసేందుకు కఠిన చర్యలు తీసుకున్నారు. కానీ ఇప్పుడు సీఎం చంద్రబాబుతో మాట్లాడి పేకాట క్లబ్బులను తెరిపిస్తానని ప్రకటించడంపై వైసీపీ నాయకులు మండిపడుతున్నారు.