న్యూఢిల్లీ : భారతీయ వ్యోమగామి, గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లాను భారత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక శౌర్య పురస్కారం అశోక చక్రతో గౌరవించింది. ఆయన యాక్సియమ్-4 మిషన్‌లో భాగంగా అంతర్జాతీయ అంతర్జాతీయ కేంద్రానికి వెళ్లి వచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన ప్రదర్శించిన ధైర్య, సాహసాలకు ఈ గుర్తింపు లభించింది. 2025 జూన్‌లో ఆయన ఐఎస్ఎస్కు వెళ్లారు. దీనిలో ఆయన మిషన్ పైలట్‌గా వ్యవహరించారు. నాలుగు దశాబ్దాల తర్వాత ఐఎస్ఎస్కు వెళ్లిన తొలి భారతీయుడు ఆయనే. 18 రోజులపాటు నిర్వహించిన ఈ మిషన్‌లో 60 శాస్త్రీయ పరిశోధనలు చేశారు.
గణతంత్ర దినోత్సవాల సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 70 మంది సాయుధ దళాల సిబ్బందికి శౌర్య పతకాలకు ఆమోదం తెలిపారు. శుభాన్షు శుక్లాకు అశోక చక్ర, ముగ్గురికి కీర్తి చక్ర, 13 మందికి శౌర్య చక్ర (ఒకరికి మరణానంతరం), 44 సేనా పతకాలు (శౌర్య), ఆరుగురికి నవ సేన మెడల్స్ (శౌర్య), ఇద్దరికి వాయు సేన పతకాలు ప్రకటించారు. భారత నావికా దళానికి చెందిన ఇద్దరు మహిళలు లెఫ్టినెంట్ కమాండర్ డిల్నా కే, లెఫ్టినెంట్ కమాండర్ రూప ఏ శౌర్య చక్ర పురస్కారాలను సాధించారు. వీరు కొన్ని నెలల క్రితం ఇండియన్ నావల్ సెయిలింగ్ వెజల్ తరిణిలో ప్రపంచాన్ని చుట్టి వచ్చారు. అశోక చక్ర భారత దేశపు ప్రథమ అత్యున్నత స్థాయి పీస్‌టైమ్ గాలంట్రీ అవార్డ్.
రెండో స్థానంలో కీర్తి చక్ర, మూడో స్థానంలో శౌర్య చక్ర ఉన్నాయి. ఈ ఏడాది కీర్తి చక్ర పొందినవారిలో మేజర్ అర్ష్‌దీప్ సింగ్ (అస్సాం రైఫిల్స్), నాయిబ్ సుబేదార్ డోలేశ్వర్ సుబ్బ (పారాస్పెషల్ ఫోర్సెస్), గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ ఉన్నారు. గగన్‌యాన్‌కు శిక్షణ పొందిన నలుగురిలో నాయర్ ఒకరు. ఆదివారం ప్రకటించిన 13 శౌర్య చక్ర పురస్కారాల్లో 10 ఆర్మీ సిబ్బందికి (వీరిలో ఒకరికి మరణానంతరం), రెండు నావికా దళం సిబ్బందికి, ఒకటి పారామిలిటరీ అధికారికి లభించాయి. వీటితోపాటు పరమ్ విశిష్ట్ సేవా పతకాలు (30), ఉత్తమ్ యుద్ధ సేవా మెడల్స్ (4), అతి విశిష్ట్ సేవా మెడల్స్ (56), యుద్ధ సేవా మెడల్స్ (9), బార్ టు సేనా మెడల్స్ (డిస్టింగ్విష్డ్) (2), సేనా మెడల్స్ (డిస్టింగ్విష్డ్) (43), నవ సేన మెడల్స్ (డిస్టింగ్విష్డ్) (8), వాయు సేన మెడల్స్ (డిస్టింగ్విష్డ్) (14), విశిష్ట్ సేవ మెడల్స్ (135)లకు కూడా రాష్ట్రపతి ఆమోదం తెలిపారు.