అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చినా కూడా ఏపీ సీఎం జగన్ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై అమరావతి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమరావతి పరిరక్షణ సమితి కన్వీనర్ శివారెడ్డి మీడియాతో మాట్లాడుతూ కోర్టు ఆదేశాలను సైతం దిక్కరించి హైకోర్టు తీర్పులకు వ్యతిరేకంగా మాట్లాడటం వైసీపీ ప్రభుత్వానికే దక్కిందని అన్నారు. ప్రభుత్వానికి కోర్టు మొట్టికాయలు వేసినా మూడు రాజధానులే తమ విధానమనడం ప్రకటించడం శోచనీయమని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్‌ను మూడు ముక్కలుగా విభజించి ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రాబోయే రోజుల్లో జగన్ ప్రభుత్వానికి పరాభవం తప్పదని తెలిపారు. అమరావతి నిర్మాణ వ్యయాలపై సీఎం తప్పుడు లెక్కలు చెప్పారని ఆరోపించారు. మూడు రాజధానులపై ప్రజలను మభ్యపెట్టె ప్రయత్నం చేస్తుందని తెలిపారు. అమరావతి రాజధాని అభివృద్ధి చెందేవరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.