Srisailam Temple | శ్రీశైలం : జ్యోతిర్లింగ క్షేత్రం, శక్తిపీఠమైన శ్రీశైలానికి వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరుగుతున్నది. క్రమంలో దర్శన విధానంలో మార్పులు చేసినట్లు ఈవో చంద్రశేఖర్ ఆజాద్ పేర్కొన్నారు. సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యం కల్పిస్తూ రద్దీ రోజుల్లో మల్లన్న దర్శన భాగ్యం అందరికీ ఒకేలా ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ముఖ్యంగా వారాంతపు రోజులు, ప్రభుత్వ సెలవుదినాలు, వైదిక కమిటీ సూచించిన ప్రత్యేక పర్వదినాలు, మహోత్సవాల సమయంలో గర్భాలయ అభిషేకాలు, స్పర్శ దర్శనాలు, శ్రీచక్ర కుంకుమార్చనలతోపాటు ఉదయాస్తమాన సేవ, ప్రాతః కాలసేవ, ప్రదోషకాల సేవలను సైతం నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు.
అదే విధంగా శ్రీవృద్ధ మల్లికార్జున స్వామికి జరిపించే అభిషేకాలు, బిల్వార్చనలు యథావిధిగా నిర్వహించనున్నట్లు తెలిపారు. వారాంతపు సెలవుల్లో రోజుకు 40వేల మంది భక్తులకుపైగా స్వామి అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. మహాశివరాత్రి, ఉగాది బ్రహ్మోత్సవాల సమయంలో రోజుకు దాదాపు లక్ష మందికిపైగా భక్తులు క్షేత్రానికి తరలివస్తున్నారని ఈవో పేర్కొన్నారు. రద్దీ రోజుల్లో భక్తులందరి దర్శనార్థం దేవస్థానం వైదిక కమిటీ తీసుకున్న నిర్ణయాలకు భక్తులు సైతం సహకరించాలని ఈవో కోరారు.