Tirumala | వైసీపీ హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందన్న వార్తలు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద దుమారం రేపుతోంది. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై ప్రముఖ న్యాయవాది వినీత్ జిందాల్ కేంద్ర హోం శాఖకు ఫిర్యాదు చేశారు.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హిందువుల ఆత్మను హత్య చేశారని వినీత్ జిందాల్ మండిపడ్డారు. హిందువుల నమ్మకాలను, విశ్వాసాలను, ఆలయం పవిత్రతను దారుణంగా దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగా, కావాలనే ఇలాంటి చర్యలకు జగన్ మోహన్ రెడ్డి పాల్పడ్డారని ఆరోపించారు. ఈ క్రమంలోనే జగన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరారు.
ఈ వ్యవహారంపై కేంద్ర హోం శాఖతో పాటు ఏపీ, ఉత్తరప్రదేశ్ డీజీపీలకు న్యాయవాది వినీత్ జిందాల్ ఫిర్యాదు చేశారు. జగన్‌తో పాటు అప్పటి టీటీడీ పాలకవర్గం, జంతువుల కొవ్వు నెయ్యిని సరఫరా చేసిన కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భారత న్యాయ సంహితలోని 152, 192, 196, 298, 358 సెక్షన్ల కింద వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరారు. జాతీయ భద్రతా చట్టం కింద కూడా జగన్‌పై చర్యలు తీసుకోవాలని అన్నారు.
కాగా, తిరుమల లడ్డూ తయారీలో కల్తీ జరిగినట్లు వస్తున్న ఆరోపణలపై శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు ఆవేదన వ్యక్తం చేశారు. దేవుడి ప్రసాదాల్లో కల్తీ జరగడం విచారమని అన్నారు. తిరుమల శ్రీవారి లడ్డూల నాణ్యత సరిగ్గా లేదని గతంలోనే అప్పటి చైర్మన్, ఈవో దృష్టికి తీసుకెళ్లానని రమణ దీక్షితులు తెలిపారు. ప్రసాదాల పరిమాణాలు కూడా సరిగ్గా లేవని ఫిర్యాదు చేశానని అన్నారు. కానీ తన తోటి అర్చకుల సహకారం అందించకపోవడంతో.. తనది ఒంటరి పోరాటం అయ్యిందని అన్నారు. దీంతో తన పోరాటానికి ఫలితం లేకుండా పోయిందని అన్నారు. దీనివల్ల ఐదేళ్లు మహాపాపం జరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.