Tirumala Laddu | అతి పవిత్రంగా భావించే తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వులు వాడారని ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారానికే తెరలేపాయి. దీనిపై ప్రపంచవ్యాప్తంగా హిందువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారని టీడీపీ చేస్తున్న ప్రచారమంతా బోగస్ అని టీటీడీ ఈవో శ్యామలరావు మాటల్లో తేలిపోయింది. టీటీడీ ఈవో శ్యామలరావు ప్రఖ్యాత ఆంగ్ల వెబ్సైట్ ది ప్రింట్కు ఇచ్చిన ఇంటర్య్యూలో ఆయన కీలక విషయాలను వెల్లడించారు.
తమిళనాడుకు చెందిన ఏఆర్ డెయిరీ నుంచి వచ్చిన 10 ఆవు నెయ్యి ట్యాంకర్లలో నాలుగింటిలో నాణ్యత తగ్గినట్లు టీటీడీ నిపుణులు గుర్తించారని ఈవో శ్యామలరావు తెలిపారు. జూలై 6వ తేదీన వచ్చిన రెండు ట్యాంకర్లలో, జూలై 12వ తేదీన వచ్చిన మిగిలిన ట్యాంకర్లలో శాంపిల్స్‌ను సేకరించి గుజరాత్‌లోని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకు పంపించామని పేర్కొన్నారు. ఆ నెయ్యిని అస్సలు ఉపయోగించలేదని స్పష్టం చేశారు. నాణ్యత సరిగ్గా లేదని భావించిన ఆ నాలుగు ట్యాంకర్లను పక్కన బెట్టామని చెప్పారు. జంతు, వెజిటెబుల్ సంబంధిత ఫ్యాట్ కలిసిందని ఎన్డీడీబీ నుంచి నివేదిక రావడంతో ఆ ట్యాంకర్లను ఏఆర్ డెయిరీకి పంపించేశామని వెల్లడించారు.
ఈ ఘటన జరిగిన సమయానికి టీటీడీకి ఐదు ఏజెన్సీలు నెయ్యిని సరఫరా చేస్తున్నాయని ఈవో శ్యామలరావు తెలిపారు. అందులో ఏఆర్ డైరీ ట్యాంకర్లలోనే నెయ్యి తక్కువ నాణ్యత ఉన్నట్లు తేలిందని పేర్కొన్నారు.