YS Jagan | పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో రిగ్గింగ్ చేసి టీడీపీ గెలిచిందని వైసీపీ ఆరోపిస్తున్న వేళ ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అధర్మం ఎంత బలంగా ఉన్నా.. అది తాత్కాలికం మాత్రమేనని తెలిపారు. ధర్మం ఎంత నెమ్మదిగా వెళ్లినా అది శాశ్వతమని స్పష్టం చేశారు. శ్రీకృష్ణుని జీవితమే దీనికి నిదర్శనమని పేర్కొన్నారు.
కృష్ణాష్టమని సందర్భంగా వైఎస్ జగన్ తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కృష్ణాష్టమి మీకు శాంతిని, ప్రేమను, విజయాన్ని తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగానే పులివెందుల జడ్పీటీసీ ఎన్నికలో టీడీపీ అక్రమాల గురించి ఆయన పరోక్షంగా స్పందించారు.
పులివెందుల నియోజకవర్గంలోని ఒక చిన్న జడ్పీటీసీ సీటును లాక్కునేందుకు, రాజంపేటలో మరో చిన్న ఒంటిమిట్ట ZPTC సీటును బలవంతంగా చెరబట్టేందుకు ఒక గూండా మాదిరిగా చంద్రబాబు అరాచకాలు చేసి, ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేశారని ఇటీవల జగన్ ఆరోపించారు. పులివెందుల ఉప ఎన్నికలో 15 పోలింగ్ బూత్‌లు ఉండగా, వాటిలో వైసీపీ ఏజెంట్లను అస్సలు ఉండనివ్వలేదని అన్నారు. ఏ ఒక్క ఏజెంట్‌ను బూత్ దగ్గరకు రానివ్వకుండా ఆపేసి రిగ్గింగ్ చేశారని ఆరోపించారు. మీ పరిపాలన మీద మీకు విశ్వాసం ఉంటే.. మీరు ప్రజలకు మంచి చేశారని నమ్మితే వారు మీకు ఓటు వేస్తారనుకుంటే పులివెందుల ఎన్నికలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే విడుదలైన ఎన్నికల ఫలితాల్లో కూటమి విజయం సాధించిన సంగతి తెలిసిందే.