Home Guard | ప్రభుత్వ ఉద్యోగులు అడ్డదారిలో అక్రమాస్తులు కూడబెట్టి అడ్గంగా దొరికిపోయిన ఘటనలు నిత్యం ఎక్కడో ఒక చూట చూస్తూనే ఉంటాం. అయితే కొన్నిసార్లు వాళ్లు చేస్తున్న ఉద్యోగానికి వెనకేసిన అక్రమ సంపాదనకు పొంతనే ఉండదు. అలాంటి షాకింగ్ ఘటనే ఏపీలో వెలుగుచూసింది. ఆంధ్రప్రదేశ్‌లో ఓ హోంగార్డు భారీగా అక్రమాస్తులు కూడబెట్టి హాట్ టాపిక్‌గా మారాడు.
విజయనగరం జిల్లా పోలీస్ కార్యాలయంలో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసరావు ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. విజయనగరం, గుర్ల, విశాఖపట్నం ప్రాంతాల్లోని శ్రీనివాస రావు నివాసాల్లో తనిఖీలు చేసి, సుమారు రూ.20 కోట్లు అక్రమ ఆస్తులు కూడబెట్టినట్టుగా గుర్తించారు. శ్రీనివాసరావు ఏసీబీలో 15 ఏళ్లు పనిచేసి అధికారుల దాడుల గురించి ముందుగానే సమాచారమిచ్చి డబ్బులు తీసుకునేవాడని, అవినీతి ఆరోపణలు రావడంతో అతడిని పోలీస్ కార్యాలయానికి బదిలీ చేశారని ఏసీబీ అధికారులు వెల్లడించారు.
హోంగార్డు శ్రీనివాసరావు ఇంటితోపాటు అతడి సన్నిహితులు, బంధువుల నివాసాల్లో కూడా ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నట్టు సమాచారం. సాధారణ హోంగార్డు ఉద్యోగం చేసే వ్యక్తి ఇంత భారీ మొత్తంలో ఆస్తులు సంపాదించడం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇవాళ తెల్లవారుజాము నుంచే ఏసీబీ బృందాలు రికార్డులను పరిశీలిస్తున్నాయి.