Viral News | ఏపీలో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. విజయనగరం జిల్లాలో ఓ మహిళను కాటేసిన పాము అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఈ విషయం తెలిసి సదరు మహిళ భర్తతో పాటు వైద్యులు కూడా ఆశ్చర్యపోతున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. విజయనగరం జిల్లా ఎస్ కోట మండలం లింగంపేటకు చెందిన నందిపల్లి సత్యవతి అనే మహిళ శుక్రవారం రాత్రి బహిర్భూమి కోసం ఇంటికి సమీపంలో ఉన్న చెట్ల పొదల్లోకి వెళ్లింది. ఆ సమయంలో సత్యవతిని పాము కాటేసింది. ఈ హఠాత్పరిణామంతో భయపడిపోయిన సత్యవతి పెద్ద పెద్దగా కేకలు వేయడంతో గమనించి కుటుంబసభ్యులు ఆమె దగ్గరకు వెళ్లారు. పాము కాటేసిన విషయం చెప్పడంతో ఆమెను హుటాహుటిన ఎస్ కోట ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వెంటనే ఆస్పత్రి వైద్యులు చికిత్స అందించడంతో సత్యవతికి ప్రాణాపాయం తప్పింది.
Snake
ఘటన జరిగిన తెల్లారి సత్యవతిని పాము కాటేసిన ప్రాంతానికి ఆమె భర్త సన్యాసయ్య, మరికొందరు స్థానికులు వెళ్లారు. సత్యవతిని కాటేసిన పామును ఎలాగైనా పట్టుకోవాలని అనుకున్నారు. కానీ అక్కడకు వెళ్లిన వారంతా ఒక్కసారిగా కంగుతిన్నారు. ఎందుకంటే సత్యవతిని కాటేసిన పాము అక్కడే చనిపోయి పడి ఉన్నది. దీంతో కంగారు పడిన సన్యాసయ్య వెంటనే వైద్యులకు విషయాన్ని తెలియజేశాడు. అయితే.. మనిషిని కరిచి పాము చనిపోయే పరిస్థితి ఉండదని.. అలాంటివి వైద్య శాస్త్రంలో ఎక్కడా జరగలేదని తెలిపారు. బహుశా ఆ పాము అనారోగ్యంతో ఉండి ఉంటుందని.. కాటేసిన కంగారులో సత్యవతి తొక్కడం వల్లే పాము చనిపోయి ఉంటుందని అభిప్రాయపడ్డారు. కానీ సత్యవతిని కరవడం వల్లే పాము మరణించిందని ఆ గ్రామంలో జనాలు ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు.