Srisailam Temple | భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దేవస్థానం లండన్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటుదక్కించుకున్నది. ఆ సంస్థ దక్షిణ భారత ప్రాంతీయ విభాగపు సంయుక్త కార్యదర్శి డాక్టర్ ఉల్లాజి ఇలియాజర్ ధ్రువీకరణపత్రాన్ని అందజేశారు. శ్రీశైలక్షేత్ర ఆధ్యాత్మిక ప్రాముఖ్యత, ప్రధానాలయ విస్తీర్ణం, ప్రధానాలయం చుట్టూ ఉన్న అరుదైన శిల్పప్రాకారం, క్షేత్రంలోని ప్రాచీన కట్టడాలు తదితర అంశాల ఆధారంగా శ్రీశైల ఆలయాన్ని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్సు జాబితాలో చేర్చినట్లుగా ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. పరిపాలనా కార్యాలయ సమావేశ మందిరంలో జరిగిన ఈ ధ్రువీకరణపత్రం అందజేత కార్యక్రమానికి ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో శ్రీశైల క్షేత్రానికి చోటు లభించడం సంతోషం కలిగిస్తుందన్నారు.
క్షేత్ర ప్రత్యేకతల కారణంగా అండన్ వరల్డ్ రికార్డ్స్ జాబితాలో సంస్థవారు శ్రీశైలాన్ని చేర్చినట్లు తెలుస్తుందన్నారు. దేవస్థానం ఈవో పెద్దిరాజు శ్రీశైలక్షేత్ర ప్రత్యేకతలను వివరించారు. క్షేత్రం భూమండలానికి నాభిస్థానంగా పేరొందిందని.. అదేవిధంగా శ్రీశైలక్షేత్రంలో పుణ్యతీర్థాలు, సహజ జలధారలు మొదలైనవన్నీ క్షేత్ర ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా నిలుస్తున్నాయన్నారు. అనంతరం సంస్థ సంయుక్త కార్యదర్శి ఉల్లాజి ఇలియాజన్ మాట్లాడుతూ క్షేత్ర విశేషాలు, క్షేత్రంతో ముడిపడివున్న అరుదైన అంశాలు మొదలైనవాటి కారణంగా శ్రీశైలాలయాన్ని వరల్డ్ బుక్ జాబితాలో చేర్చినట్లు తెలిపారు.