AP News | ఏపీలోని రాజమండ్రి రూరల్ శాటిలైట్ సిటీలో దారుణం జరిగింది. అష్టా చమ్మా ఆటలో తలెత్తిన వివాదం కారణంగా ఓ యువకుడిని స్నేహితులే హత్య చేశారు. కత్తితో విచక్షణరహితంగా పొడిచి చంపేశారు.
వివరాల్లోకి వెళ్తే.. శాటిలైట్ సిటీకి చెందిన ముగ్గురు స్నేహితులు మార్గాని నాగేశ్వరరావు, కైరం వీరబాబు, కైరం రమణ బుధవారం మధ్యాహ్నం అష్టాచమ్మా ఆడుకున్నారు. ఆట మధ్యలో మార్గాని నాగేశ్వరరావుతో మిగిలిన ఇద్దరికి గొడవ అయ్యింది. మాటలతో మొదలైన ఆ గొడవ కాస్త కొట్టుకోవడం దాకా వెళ్లింది. ఈ క్రమంలోనే ఆగ్రహానికి గురైన కైరం వీరబాబు, రమణలు నాగేశ్వరరావును కత్తితో పొడిచారు. దీంతో తీవ్ర రక్తస్రావమైన నాగేశ్వరరావు మరణించాడు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, నాగేశ్వరరావు మరణించడంతో కైరం వీరబాబు, రమణలు అక్కడి నుంచి పరారయ్యారు.