తిరుమల : భక్తుల ఆరోగ్య భద్రతను దృష్టిలో పెట్టుకుని తిరుమల(Tirumala) నుంచి తిరుపతికి వెళ్లే దిగువ ఘాట్ రోడ్డులోని ఏడో మైలు వద్ద ప్రాథమిక చికిత్స కేంద్రాన్ని టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు (BR Naidu) , ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి ఆదివారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా చైర్మన్ మీడియాతో అత్యావసర పరిస్థితిలో భక్తులు ఈ కేంద్రం వద్ద వైద్య సేవలను వినియోగించుకునేందుకు వీలుగా ప్రాథమిక చికిత్స కేంద్రం ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. ఇప్పటికే శ్రీవారి మెట్టు మార్గంలో కూడా ప్రాథమిక చికిత్స కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి మాట్లాడుతూ తిరుమలలో వైద్య సౌకర్యాలను విస్తృతం చేయడంలో భాగంగా అలిపిరి నడకమార్గంలో ఆధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసిన ప్రాథమిక చికిత్స కేంద్రం భక్తులకు సౌకర్యవంతంగా ఉంటుందని చెప్పారు. ఈ మార్గం ద్వారా ప్రతిరోజూ 20వేల నుంచి 30వేల మంది భక్తులు నడుచుకుంటూ వస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ, టీటీడీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ బి.కుసుమ కుమారి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.