Tirumala | కాలినడకన తిరుమలకు వెళ్తున్న ఓ భక్తుడిని పాము కాటేసింది. ఏపీలోని చీరాలకు చెందిన కొంతమంది బక్తులు అలిపిరి మెట్ల మార్గం నుంచి తిరుమలకు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఏడో మైలు వద్దకు వచ్చిన నాగేంద్రనాథ్ అనే యువకుడు తన సహచరుల కోసం అక్కడే టీ స్టాల్ వద్ద ఎదురుచూస్తున్నాడు. అదే సమయంలో అటవీ ప్రాంతంలో నుంచి వచ్చిన ఓ పాము అతన్ని కాటేసింది.
యువకుడిని పాము కాటు వేయడంతో అక్కడ ఉన్న శ్రీవారి భక్తులంతా ఉలిక్కిపడ్డారు. భయంతో హాహకారాలు చేశారు. కాగా భక్తులు ఇచ్చిన సమాచారంతో అక్కడకు చేరుకున్న టీటీడీ, అటవీ సిబ్బంది పాము కాటుకు గురైన యువకుడిని తిరుమలలోని అశ్విని ఆస్పత్రికి తరలించారు. అక్కడే యువకుడు చికిత్స పొందుతున్నారు.
యువకుడిని కాటేసిన పాము విషపూరితమైనది కాకపోవడంతో ప్రమాదం తప్పిందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం అతని ప్రాణాలకు ఎలాంటి అపాయం లేదని స్పష్టం చేశారు.