హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ): ఓ శుభకార్యానికి వచ్చిన 8మంది యువకులు గోదావరిలో స్నానానికి దిగి గల్లంతైన విషాదకర సంఘటన ఏపీలోని అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. కాకినాడ నుంచి కే గంగవరం మండలం శురుల్లంకలో పెండ్లికి వచ్చిన 11మంది యువకులు స్నానాలు చేయటానికి గోదావరి నదిలో దిగారు. లోతు ఎక్కువగా ఉండటంతో నీటిలో మునిగిపోయారు.
గమనించిన స్థానికులు ముగ్గురు యువకులను కాపాడగా, 8మంది ఆచూకీ లభించలేదు. గల్లంతైన వారిలో కాకినాడ, రామచంద్రపురం, మండపేటకు చెందిన క్రాంతి (20), పాల్ (18), సాయి (18), సతీశ్ (19), మహేశ్, రాజేశ్ (13), రోహిత్, మహేశ్లుగా పోలీసులు గుర్తించారు. గల్లంతైన వారి కోసం పోలీసులు, స్థానికులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.