తిరుపతి: ఆధ్యాత్మిక నగరి తిరుపతిలో (Tirupati) వరుస బాంబు బెదిరింపులు కలకలం సృష్టిస్తున్నాయి. స్థానికులతోపాటు శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు ఆందోళనకు గుర్తిచేస్తున్నాయి. నగరంలోని హోటళ్లకు మరోసారి బాంబు బెదిరింపులు వచ్చాయి. గ్యాస్, వాటర్ పైపులైన్లు, మురుగునీటి పైపుల్లో పేలుడు పదార్థాలు ఉంచామంటూ ఎనిమిది హోటళ్లకు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు తాజ్, బ్లిస్, మినర్వా, చక్రి, పాయ్ వైస్రాయ్, రీనెస్ట్, గోల్డెన్ దులీప్ హోటళ్లలో పోలీసులు.. డాగ్, బాంబు స్క్వాడ్లతో తనిఖీలు చేశారు. అయితే ఎక్కడా పేలుడు పదార్థాలు లభించకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. ఐఎస్ఐ పేరుతో మంగళవారం రాత్రి 9.30 గంటలకు ప్రారంభమైన ఈ మెయిల్స్.. అర్ధరాత్రి వరకు కొనసాగాయి.
కాగా, తమిళనాడులో ఐఎస్ఐ ఉగ్రవాది జాఫర్ సాదిక్‌కు జైలు శిక్ష పడటంతో ఐఎస్ఐ ఉగ్రవాదుల పేరిట ఈ బెదిరింపులు వస్తున్నాయి. తమిళనాడుతో పాటు తిరుపతిలోని హోటళ్లకు బాంబు మెయిల్స్ రావటం సమస్యగా మారింది. కంగారు పడాల్సిన అవసరం లేదని బెదిరింపు మెయిల్స్ ఎక్కడి నుంచి పంపుతున్నారనే విషయమై దర్యాప్త జరుగుతోందని మొత్తం ఆరు కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.