తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది.వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 26 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 26 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న 67,156 మంది భక్తులు శ్రీవారిని దర్శంచుకోగా 24,752 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4.92 కోట్లు వచ్చిందని తెలిపారు.
తిరుపతి, చిత్తూరులోని కేవీఆర్ జ్యూవెలర్స్ వ్యవస్థాపకులు కెఆర్.నారాయణమూర్తి, వారి సతీమణి కెఎన్.స్వర్ణగౌరి ఇతర కుటుంబ సభ్యులు కలిసి తిరుమల శ్రీవారికి మూడు రకాల స్వర్ణాభరణాలను రంగనాయకుల మండపంలో టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి.సుబ్బారెడ్డి, ఈవో అనిల్ కుమార్ సింఘాల్‌కు అందజేశారు.
దాత అందించిన వివరాల మేరకు సుమారు 1756 గ్రాములు బరువుగల ఈ ఆభరణాల విలువ దాదాపు రూ.1.30 కోట్లు ఉంటుందని తెలిపారు. ఇదే దాత గతేడాది డిసెంబరులో సుమారు రూ.3 కోట్లు విలువైన కటి, వరద హస్తాలను శ్రీవారికి కానుకగా అందించారు.