తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. 19 కంపార్టుమెంట్లలో భక్తులు శ్రీవారి సర్వదర్శనానికి వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో దర్శనం కలుగుతుంని అధికారులు తెలిపారు. నిన్న 71,299 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా 28,288 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.26 కోట్లు వచ్చిందని వివరించారు.
నూతన ఆంగ్ల సంవత్సరాది జనవరి 1న, వైకుంఠ ఏకాదశి సందర్భంగా జనవరి 2 నుంచి 11వ తేదీ వరకు సామాన్య భక్తులకు సంతృప్తికరంగా దర్శనం కల్పించేందుకు పటిష్ట ఏర్పాట్లు చేపడుతున్నట్టు టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. టీటీడీ అదనపు ఈవో వీరబ్రహ్మంతో కలిసితిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లు, సర్వదర్శనం క్యూలైన్లు, పీఏసీ-4 తదితర ప్రాంతాల్లో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లను పరిశీలించారు.
భక్తులకు వైకుంఠం క్యూకాంప్లెక్సు, నారాయణగిరి షెడ్లు, ఇతర ప్రాంతాల్లో అన్నప్రసాదాలు, తాగునీరు, టీ, కాఫీ విస్తృతంగా పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేపడుతున్నట్టు తెలిపారు. భక్తులు తిరుపతిలో టైంస్లాట్ టోకెన్లు పొంది వైకుంఠ ద్వార దర్శనానికి రావాలని విజ్ఞప్తి చేశారు. దీని వల్ల త్వరితగతిన దర్శనం చేసుకునే అవకాశం ఉంటుందని తెలియజేశారు.