Chandrababu | హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ) : ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సొంత డబ్బా వింటున్న పరిశీలకులు ఆయన పిచ్చి పీక్స్‌కు వెళ్లిందని వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటివరకు సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడంలో తనను మించినవారు లేరన్నట్టు ప్రగల్బాలు పలికిన బాబు.. ఇప్పుడు మేధావులు సైతం విస్తుపోయే విధంగా అతిశయోక్తులు వల్లిస్తున్నారు. ఏ మాత్రం బెరుకు లేకుండా.. ఎదుటివారు నమ్ముతారా అన్న జంకు కూడా లేకుండా బొంకేస్తున్నారు.
తన కుమారుడు లోకేశ్‌తో కలిసి దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు హాజరైన బాబు.. తమ రాష్ర్టానికి వచ్చిన పెట్టుబడులపై ఎన్డీటీవీకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తాను ఏపీలో రెండోసారి అధికారం చేపట్టిన తరువాత గత 18 నెలల్లో రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. ఈ పెట్టుబడులతో 23 లక్షల కోట్ల ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. దీనిపై ఎన్డీటీవీ యాంకర్ ఒక్కసారిగా కంగుతిన్నారు. ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ.. ‘ఏంటి 23 లక్షల కోట్ల ఉద్యోగాలు వస్తాయా?’ అని ప్రశ్నించారు. ఇందుకు బాబు ఏ మాత్రం తగ్గకుండా అవును ‘20 లక్షల కోట్ల ఉద్యోగాలు వస్తాయి’ అని పునరుద్ఘాటించారు. ఈ వ్యాఖ్యలపై నెటిజెన్లు తీవ్ర స్థాయిలో సెటైర్లు వేస్తూ, వ్యాఖ్యలు చేస్తున్నారు.
‘ఆయన మాటలు కనీసం ఆయనకైనా అర్థమవుతున్నాయా?’ అని ఒకరు ప్రశ్నించగా..వృద్ధాప్యం కారణంగా ఆయన మైండ్ పనిచేయడం లేదంటూ మరొకరు వ్యాఖ్యానించారు. దావోస్‌లో రెండు రోజుల క్రితం ఇదేవిధంగా తెలుగువారి సమావేశంలో మాట్లాడుతూ.. తాను తెచ్చిన ఐటీ పాలసీ వల్లనే 195 దేశాల్లో తెలుగువారు ఉంటున్నారని చెప్పుకున్నారు. ఆ మరుసటి రోజు తాను హైదరాబాద్‌ను మోస్ లివబుల్ సిటీగా మార్చడం వల్లనే అత్యధికంగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (జీసీసీ)లు వస్తున్నాయని సెలవిచ్చారు. ఇప్పటివరకూ చంద్రబాబు వ్యాఖ్యలపై జోక్‌లు వేస్తూ.. నవ్వుకుంటున్న జనాలు.. ఇప్పుడు ఆయన మాటలు చిరాకు తెప్పిస్తున్నాయంటూ అసహనం వ్యక్తంచేస్తున్నారు.