Nuzuvid IIIT | పురుగుల అన్నం.. నీళ్ల సాంబారు.. మైదా పిండితో చపాతీలు.. పులిసిపోయిన పిండి కలిపిన పెరుగు.. పాత్రలు కడగకుండానే వండిన కూరలు.. ఇదీ నూజివీడు ట్రిపుల్ ఐటీలో విద్యార్థులకు రోజూ పెడుతున్న భోజనం! అపరిశుభ్ర వాతావరణంలో నాసిరకం ఆహారం పెడుతుండటంతో విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారు. వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పితో అల్లాడిపోతున్నారు. ఈ భోజనం మాకొద్దు మహాప్రభో అంటూ విద్యార్థులు ఆందోళన చేస్తున్నా యాజమాన్యం తీరు మారలేదు. ఇటీవల ఏకంగా మంత్రి వచ్చి బెదిరించినా చలనం రాలేదు. ఇప్పటికీ అదే నాసిరకం భోజనం పెట్టడంతో 1300 మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.
ఏలూరులోని నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఈ నెల 23 నుంచి విద్యార్థులు అస్వస్థతకు గురికావడం మొదలైంది. ప్రధానంగా మూడు మెస్‌ల్లో ఆహారం తిన్న విద్యార్థులు అనారోగ్యం పాలవుతున్నారు. గత నాలుగు రోజులుగా అస్వస్థతకు గురయ్యే విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. ఆదివారం 165, సోమవారం 229, మంగళవారం 345, బుధవారం 131 మంది అస్వస్థతతో ఆస్పత్రిలో చేరారు. ఈ విషయం వైరల్ కావడంతో ఏపీ మంత్రి కొలుసు పార్థసారథి బుధవారం రాత్రి ట్రిపుల్ ఐటీలో పర్యటించి, మెస్‌ను పరిశీలించారు. విద్యార్థులు, అధికారులతో సమావేశమై మెస్ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఫుడ్ పాయిజన్‌తో 1300 మంది విద్యార్థులకు పైగా అస్వస్థత
ట్రిపుల్ ఐటీ మెస్ లో పురుగుల అన్నం పెట్టడంతో విద్యార్థులు అస్వస్థత
మంత్రి కొలుసు పార్థసారథి బుదవారం రాత్రి వచ్చినప్పుడు తమ సమస్యలు చెప్పేందుకు ముందుకు వచ్చిన తమను హాస్టల్లో ఉంచి కళాశాల సిబ్బంది తాళం… https://t.co/Eewpfsj7hy pic.twitter.com/WMj7MME4d8
— Telugu Scribe (@TeluguScribe) August 31, 2024
స్వయంగా మంత్రి వచ్చి వార్నింగ్ ఇచ్చి వెళ్లినప్పటికీ మెస్ నిర్వాహకుల్లో ఎటువంటి మార్పు రాలేదు. గురువారం ఉదయం సైతం పాడైన గుడ్లు, రుచిపచీలేని ఉప్మా వడ్డించారు. మధ్యాహ్నం మాడిపోయిన బెండకాయ కూర, నీళ్ల పెరుగు వడ్డించారు. అన్నంలో పురుగులు కూడా వచ్చాయి. ఈ ఆహారం తినడంతో తాజాగా 113 మంది ఆస్పత్రి పాలయ్యారు. దీంతో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. మంత్రి పార్థసారథితో తమ సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన తమను హాస్టల్లో ఉంచి కాలేజీ సిబ్బంది తాళం వేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఓపీ తక్కువగా చూపించేందుకు ఆస్పత్రికి వస్తున్న విద్యార్థుల వివరాలను నమోదు చేయడం లేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఆరోగ్యం విషమించిన కూడా ఆస్పత్రిలో ఇన్ పేషెంట్లుగా చేర్చుకోవడం లేదని.. మందులిచ్చి పంపిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రిలో కనీసం ఓఆర్ఎస్ కూడా అందుబాటులో ఉండటం లేదని.. 20 పడకలు మాత్రమే ఉన్నాయని చెప్పారు. దీంతో దాదాపు 500 మందికి పైగా విద్యార్థులు మెరుగైన వైద్యం కోసం ఇంటికి వెళ్లిపోయారని అంటున్నారు.