14 ఏండ్ల తర్వాత కాసిన రుద్రాక్షలు
అద్భుతం సాధించిన రిటైర్డ్ ఆర్డీవో లక్ష్మయ్య
కరీంనగర్, ఫిబ్రవరి 12 : తెలంగాణ నేలలు ఏ పంటకైనా, ఏ వృక్ష జాతికైనా అనువైనవేనని మరోసారి నిరూపితమైంది. కేవలం శీతల ప్రాంతాల్లోనే పండే ఆపిల్ సాగు ఇదివరకే సాకారం కాగా తాజాగా రుద్రాక్ష చెట్టుకు కాయలు కాశాయి. హిమాలయాలు, పర్వత శ్రేణుల్లో కనిపించే రుద్రాక్ష వృక్షం మన నేలపైనా ఫలాలను అందిస్తున్నది. నేపాల్, మయన్మార్, థాయిలాండ్, ఇండోనేషియా, భారత్లోని హిమాలయాల్లో మాత్రమే మనగలిగే రుద్రాక్ష వృక్షం రాష్ట్రంలోని పలు ప్రాం తాల్లో సాగవుతున్నది. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం న్యాలకొండపల్లికి చెందిన రిటైర్డ్ ఆర్డీవో ఆకుల లక్ష్మయ్య తన మామిడి తోటలో 14 ఏండ్ల కింద రెండు రుద్రాక్ష మొక్కలను నాటారు. ఒక్కో వృక్షం 25 నుంచి 30 అడుగుల ఎత్తుకు ఎదిగింది. ఏండ్ల తర్వాత ఇప్పుడు ఆ చెట్టు విరగకాసింది. మిత్రుడి సలహాతో 2007లో హైదరాబాద్లోని గ్రోమోర్ నర్సరీ నుంచి రెండు రుద్రాక్ష మొక్కలు తెచ్చి తోటలో నాటానని, ఇన్నేండ్లకు కాత రావడం ఆనందంగా ఉన్నదని లక్ష్మయ్య చెప్పారు. అరుదైన రుద్రాక్షలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నదని పేర్కొన్నారు.