వేసవిలో ఆకాశాన్నంటే కూరగాయల ధరలు l సరైన రకాలను సాగుచేస్తే లాభాలే.. లాభాలు! వేసవిలో కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతాయి. నగరాలు, పట్టణాల్లో మాంసాహారంతో పోటీ పడుతాయి. ఉష్ణోగ్రతల పెరుగుదల, వాతావరణంలో మార్పులే.. పంటలకు ప్రతిబంధకంగా మారుతాయి. వడగాల్పులతో మొకల పెరుగుదల లోపించి,పూత, పిందెలు రాలడంతో దిగుబడులు తగ్గుతాయి. వీటిని అధిగమించే రకాలను సాగు చేస్తేనే.. అన్నదాతను లాభాలు వరిస్తాయి.
వేసవిలో కూరగాయలను సాగుచేసి అధిక లాభాలు పొందవచ్చని తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే, ఎండకాల వాతావరణానికి అనువైన కూరగాయలను, అధిక వేడిని తట్టుకుని ఎక్కువ దిగుబడినిచ్చే ప్రత్యేక రకాలను ఎంచుకోవాలని సూచిస్తున్నారు. సరైన యాజమాన్య పద్ధతులను పాటించడం ద్వారా మండే ఎండల్లోనూ భారీ దిగుబడులు సాధించవచ్చని అంటున్నారు.
అనుకూల పంటలు..
వేసవిలో సాగుకు టమాట, వంకాయ, మిరప, బెండ తోపాటు గుమ్మడి, పొట్ల, కాకర, బీర, దోస, బూడిద గుమ్మడి లాంటి తీగజాతి కూరగాయలు అనుకూలంగా ఉంటాయి. ఈ పంటలు తేమతో కూడిన వేడి వాతావరణంలో అధిక దిగుబడిని ఇస్తాయి. అయితే, ఎక్కువ ఉష్ణోగ్రతను, ఎకువ మంచును తట్టుకోలేవు. ఉష్ణోగ్రతలు 25 -35 డిగ్రీల వద్ద మొక్కల పెరుగుదల బాగుంటుంది. దిగుబడులు కూడా పెరుగుతాయి. ఉష్ణోగ్రతలు 18 డిగ్రీల కంటే తకువగా ఉంటే, పెరుగుదల తగ్గుతుంది. పూత, పిందె రావడం ఆలస్యమవుతుంది. అలాగే 36 డిగ్రీల కన్నా ఎకువ ఉన్నప్పుడు కూడా దిగుబడి బాగా తగ్గిపోతుంది.
నారు పెంపకం..
వర్షాకాల పంట మాదిరిగా కాకుండా, వేసవి సాగుకోసం షేడ్ నెట్, ప్లగ్ ట్రేలలో నారు పెంచుకోవడం మంచిది. నారు దశలో మొకలకు సరిపడే కాంతి, నీడ, తేమ శాతం మాత్రమే అవసరం. షేడ్ నెట్లో ఇది సాధ్యపడుతుంది. మొదట ఏడు నుంచి తొమ్మిది మీటర్ల పొడవైన సిమెంట్ లేదా రాతి స్తంభాలను ఐదు నుంచి ఎనిమిది మీటర్ల దూరంలో నిలువుగా పాతాలి. వీటిపై భాగాన ఇనుప తీగ సహాయంతో షేడ్ నెట్‌ను ఏర్పాటు చేసుకోవాలి. పకల నుంచి కూడా పురుగులు, కీటకాలు చోరబడకుండా తెరలు దించాలి. దీనివల్ల తెల్ల దోమ, పేనుబంక, నల్లి వంటి వాటిని నియంత్రించవచ్చు. తెగుళ్ల వ్యాప్తినీ నివారించవచ్చు. ‘ప్లగ్ ట్రే’ లాంటి ఆధునిక పద్ధతుల్లోనూ నారు పెంచుకోవచ్చు. సంప్రదాయ పద్ధతిలో కూరగాయల నారు పెంచితే నారుకుళ్లు, మృత్తికా సమస్యలు ఏర్పడుతాయి. ఫలితంగా నారు చనిపోవడం, ఎదుగుదల లేకపోవడంతో నష్టం వాటిల్లుతుంది.
సాంద్రత పెంచితేనే..
వేసవిలో అధిక ఉష్ణోగ్రత వల్ల మొక పెరుగుదల తకువగా ఉంటుంది. ఫలితంగా పూత, పిందె రాలి దిగుబడులూ తగ్గుతాయి. అందువల్ల మొకలను తకువ దూరంలో నాటుకొని, వాటి సాంద్రత పెంచుకోవాలి. దీనివల్ల విడిగా మొక దిగుబడి తగ్గినప్పటికీ, ఎకువ మొకలు ఉండటం వల్ల మొత్తం విస్తీర్ణంలో దిగుబడి తగ్గకుండా ఉంటుంది. ఇందుకోసం విత్తన మోతాదును పెంచాలి. విత్తనశుద్ధిని తప్పనిసరిగా చేసి, సకాలంలో విత్తుకోవాలి. ఆలస్యమైతే ఆకుమచ్చ(లీఫ్ కర్ల్) వైరస్ ఎకువగా వ్యాపిస్తుంది.
నీటి యాజమాన్యం..
కూరగాయల్లో 80 నుంచి 95 శాతం నీరే ఉంటుంది. అందువల్ల వీటి సాగులో నీటి ఎద్దడి ఎదురైతే, పంట దిగుబడితోపాటు నాణ్యతమీద కూడా ప్రభావం పడుతుంది. నీటి ఎద్దడి ఉండే ప్రాంతాల్లో డ్రిప్, స్ప్రింక్లర్ పద్ధతిని ఉపయోగించడం మంచిది. దీనివల్ల ఉన్న కొద్దిపాటి నీటితోనే ఎకువ విస్తీర్ణంలో కూరగాయలు పండించవచ్చు. సాధారణ సాగులో ఎకరానికి ఉపయోగించే నీటితో.. డ్రిప్ పద్ధతి ద్వారా రెండున్నర ఎకరాల్లో, స్ప్రింక్లర్ పద్ధతిలో రెండు ఎకరాల్లో సాగుచేయవచ్చు.
తెగుళ్ల యాజమాన్యం
వేసవిలో తెగుళ్లు, పురుగుల ఉధృతిని తట్టుకొనే రకాలనే ఎంచుకోవాలి. ఆరోగ్యవంతమైన పంట లేదా నేల నుంచే విత్తనాలు సేకరించాలి. ఏ పంట సాగు చేసినా, మొక్కలు నాటే ముందు శుద్ధి చేసుకోవాలి. ఇందుకోసం లీటర్ నీటిలో 150 గ్రా. ట్రై సోడియం ఆర్థోఫాస్పేట్ కలుపుకొని, ఈ మిశ్రమంలో నారు మొక్కలను 10 నిమిషాలపాటు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత మంచినీటిలో శుభ్రంగా కడిగి, చేనులో నాటుకోవాలి. అన్ని పంటల్లోనూ పూత దశలో 10 లీటర్ల నీటిలో 4.5 మి.లీ. ప్లానోఫిక్స్ లేదా లీటర్ నీటిలో 10 మి.గ్రా. 2.4-డి కలిపి పిచికారీ చేయాలి. తెగుళ్లు సోకిన మొకలను పీకి నాశనం చేయాలి.
పూత, పిందె రాలకుండా..
వేసవిలో కూరగాయల సాగులో ఎదురయ్యే ప్రధాన సమస్య పూత, పిందె రాలడం. అధిక ఉష్ణోగ్రతలు, వేడిగాలులే ఇందుకు కారణం. దీనిని నివారించడానికి నేలలో తేమను సంరక్షించాలి. టమాట, వంకాయ చేల కోసం 10 లీటర్ల నీటిలో 2.5 మి.లీ. ప్లానోఫిక్స్ (ఎన్.ఎ.ఎ) కలిపి, పూత దశలో వారం వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి. మిరప తోటలోనైతే 10 లీటర్ల నీటిలో 20 మి.గ్రా. టైకాంటినాల్ లేదా 2.5 మి.లీ. ప్లానోఫిక్స్ కలిపి రెండుసార్లు పిచికారీ చేసే పిందె నిలుస్తుంది. తీగజాతి కూరగాయల్లో అధిక ఉష్ణోగ్రతల వల్ల మగపూలు ఎక్కువగా వస్తాయి. ఫలితంగా లింగ నిష్పత్తి తగ్గి, దిగుబడిపై ప్రభావం చూపుతుంది. దీని నివారణకు పూతదశలో 10 లీటర్ల నీటిలో 25 గ్రా. సైకోసిల్ కలిపి పిచికారీ చేయాలి.
సస్యరక్షణ చర్యలు..
వేసవిలో రసం పీల్చే పురుగుల ఉధృతి ఎక్కువ. ముఖ్యంగా తెల్లదోమ, పేనుబంక, పిండి పురుగు, నల్లి వంటివి ఎక్కువ నష్టాన్ని కలిగిస్తాయి. వీటి నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. పొలం చుట్టూ జొన్న లేదా సజ్జ పంటలను రక్షణ పంటగా వేసుకోవాలి. దీనివల్ల రసం పీల్చే పురుగుల ఉధృతిని తగ్గించవచ్చు. పొలంలో అక్కడక్కడ ఎకరానికి నాలుగు చొప్పున పసుపు రంగు డబ్బాలు లేదా రేకులను ఆముదం, గ్రీజు పూసి పెట్టాలి. వీటికి తెల్లదోమలు ఆకర్షితమవుతాయి. మొక్క నాటిన 30 రోజుల నుంచి పూత వచ్చే వరకు 5 శాతం వేప కషాయాన్ని 15 రోజుల తేడాతో పిచికారీ చేయాలి. రసం పీల్చే పురుగుల నివారణకు లీటర్ నీటిలో 2 మి.లీ. ఫిప్రోనిల్ లేదా 1.5 గ్రా. ఎసిఫేట్ లేదా 0.3 మి.లీ. ఇమిడాక్లోప్రిడ్ కలిపి పిచికారీ చేయాలి. పండు ఈగ బెడద నివారణకు లీటర్ నీటిలో 2 మి.లీ. మలాథియాన్ కలిపి పిచికారీ చేయాలి.
ఎరువుల యాజమాన్యం..
వేసవిలో కూరగాయల సాగుకు నత్రజనిని రెండు సమపాళ్లుగా చేసి, విత్తిన 25-30 రోజులకు ఒకసారి, పూత పిందె దశలో మరోసారి వేసుకోవాలి. ఎరువును మొకకు దగ్గరలో వేయకూడదు. ఎరువులు వేసిన వెంటనే మట్టిని కప్పి, నీటి తడులు ఇవ్వాలి. ఎప్పటికప్పుడు కలుపు మొకలను తీసివేయాలి. 2-3 తడుల తర్వాత మట్టిని గుల్లచేయాలి. మొక్కల పెరుగుదల కోసం వీలైనంత ఎకువ మోతాదులో సేంద్రియ ఎరువులు, జీవ ఎరువులను వాడాలి. సేంద్రియ ఎరువులు ఎకువగా వాడటం వల్ల నేల గుల్లబారుతుంది. తేమను ఎకువ రోజులు పట్టి ఉంచి, మొకకు అందుబాటులో ఉండేలా చేస్తాయి.
తేమ సంరక్షణ
నీటి తడులతోపాటు నేలలోని తేమను సంరక్షించే చర్యలూ ముఖ్యమైనవే. ఇందుకోసం పాదులు, రెండు వరుసల మధ్య వరిగడ్డి, వరి ఊక, వేరుశనగ పొట్టు, ఎండుటాకులు లేదా పచ్చిరొట్ట ఎరువులను పరచాలి. దీనివల్ల నేలలో తేమ అలాగే ఉండి, మొకకు ఎకువ రోజులు అందుబాటులో ఉంటుంది. అంతేకాకుండా కలుపు పెరుగుదలనూ అరికడుతుంది. మల్చింగ్ పద్ధతి వల్ల నేలలోని తేమ ఆవిరి కాకుండా కాపాడుకోవచ్చు.
–మజ్జిగపు శ్రీనివాస్‌రెడ్డి