Raghavapuram | పల్లెల్లో బతుకు బరువు. ఉపాధి కరువు. మనసు చంపుకొని, బంధాలను తెంచుకొని నగరాలబాట పడతారు. అక్కడ, చేతినిండా పనున్నా గుండెనిండా వెలితే. సాయంత్రానికి కూలీ డబ్బులొస్తాయి. అయినా, ఎక్కడో అసంతృప్తి. రేపటి గురించి ఆలోచించాల్సిన భయం లేకుండా.. ఉన్న ఊళ్లోనే ఏదైనా పని దొరికితే.. బతుకు పండుగే కదా! అనిపిస్తుంది. అనిపించడం ఏమిటి.. నిజం చేశారు రాఘవాపురం గ్రామస్థులు.
ఆ ఊళ్లో విటమిన్లు తారసపడతాయి. ప్రొటీన్లు పలకరిస్తాయి. మెగ్నీషియం ముచ్చట్లు పెడుతుంది. అంటే, వీటన్నిటికీ మూలమైన ఆకుకూరలు పుష్కలంగా పండుతాయి. తోటకూర, పుంటికూర, పాలకూర, బచ్చలికూర, మెంతికూర, చుక్కకూర, పుదీన, కొత్తిమీర, గంగ వాయిలికూర.. ఇలా ప్రతి పెరట్లో పచ్చదనమే. ప్రతి జేబులో పచ్చ‘ధనమే’! ఈ ఆకుకూరల విప్లవం వెనుక ఓ కథ ఉంది. ఒకప్పుడు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతానగర్ మండలంలోని రాఘవాపురం కూడా అన్ని పల్లెల లాంటిదే. కష్టాలూ కరువులూ ఉక్కిరిబిక్కిరి చేసేవి. వలసలకు వెళ్లాల్సి వచ్చిన ప్రతిసారీ కడుపులు సలసలా మండేవి. కానీ, పొలిమేర దాటాల్సిన అనివార్య పరిస్థితులు. ఇలాంటి స్థితిలో రాఘవాపురం ప్రజలు ఎక్కడికో వెళ్లి అడ్డాకూలీగా మారడం కంటే.. ఉన్న ఊళ్లోనే కూలిపనులు చేసుకుంటే చాలనీ, అదే పదివేలనీ అనుకున్నారు. ఆకుకూరల సాగులో తమ సమస్యకు పరిష్కారం వెతుక్కున్నారు. ఐదొందల గడపలున్న గ్రామంలో దాదాపు రెండొందల కుటుంబాలు పెరటి కూరల పెంపకాన్నే ఎంచుకున్నాయి. పోటీపడి పండిస్తూ.. మంచి దిగుబడులు సాధిస్తున్నారు. ఆకుకూరల పెంపకంలో మేటిగా నిలుస్తున్నారు. మిగిలినవాళ్లు కూడా ఆ పెరళ్లలోనే కూలిపనులు చేసుకుంటారు. జిల్లాలోనే అత్యధిక విస్తీర్ణంలో ఆకుకూరలు పండిస్తున్న గ్రామం ఇదే. ప్రతి పెరటికి ఓ సాగునీటి మోటారు ఉండి తీరుతుంది.
Raghavapuram3
తాతల కాలంనాటి జీవనాధారాన్ని రాఘవాపురం ప్రజలు ఇప్పటికీ వదిలిపెట్టలేదు. పెద్దల బాటలో ఆకుకూరల సాగునే అక్కున చేర్చుకున్నారు. ప్రతి ఇల్లూ ఓ పచ్చని లోగిలే. కట్టలు కడుతూనో, కలుపులు తీస్తూనో.. ఇంటిల్లిపాదీ దర్శనమిస్తారు. విక్రయాల బాధ్యత మాత్రం పురుషులదే. ఆలస్యమైతే పచ్చికూర వాడిపోతుంది. కాబట్టే, తెల్లవారుజామున నాలుగు గంటలకే ద్విచక్ర వాహనం మీద సరుకు వేసుకుని చుట్టుపక్కలున్న కొత్తగూడెం, చండ్రుగొండ, జూలూరుపాడు, ఇల్లందు, సత్తుపల్లి, అన్నపురెడ్డిపల్లి, రేగళ్ల, చుంచుపల్లి, లక్ష్మిదేవిపల్లి, రుద్రంపూర్, పాల్వంచ, పెద్దమ్మగుడి, జగన్నాథపురం.. తదితర గ్రామాలకు వెళ్తారు. రోజూ వెయ్యి రూపాయల వ్యాపారమైనా జరగాల్సిందే. పెద్ద రైతుల రాబడి ఇంకొంత ఎక్కువే.
Raghavapuram1
‘ఈ వ్యాపారం తాతల నాటిది. ప్రతి ఇంట్లో ఆకుకూరల సాగు జరుగుతుంది. మైళ్లకు మైళ్లు ప్రయాణించి పొలాలకు వెళ్లాల్సిన పన్లేదు. నడినెత్తిన ఎండ సమస్య లేదు. అతివృష్టి, అనావృష్టి ఇబ్బందుల్లేవు. దళారీ వ్యవస్థ లేదు. గిట్టుబాటు ధర లభిస్తుందో లేదో అన్న భయమూ అవసరం లేదు. నీడపట్టు సేద్యం. కూలితో పోలిస్తే ఎక్కువ ఆదాయమే వస్తుంది. దీనివల్ల వలసల బాధ తప్పింది. ఇంకెవరికిందో పనిచేయాల్సిన తలనొప్పి కూడా లేదు’ అంటారు ఇమ్మడి రామారావు అనే రైతు. రాఘవాపురానికి ఆకుకూరలు ఓ బ్రాండ్ వ్యాల్యూ తీసుకొచ్చాయి. కస్టమర్లలో విశ్వసనీయత కూడా పెరిగింది. దీంతో రోజూ రాఘవాపురం రైతుల దగ్గరే కొనడానికి ఇష్టపడతారు. ఇంట్లో పనిచేసేవాళ్లు పెరిగేకొద్దీ లాభాలు పెరుగుతాయి. దీంతో ఆ ఊళ్లో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కూడా బలంగా ఉంది. ప్రతీ ఇంట్లో భార్యాభర్తలు, కొడుకులు కోడళ్లు కలిసి ఉంటారు, కలిసి తింటారు, కలిసే పనిచేస్తారు. దీంతో బంధాలూ బలంగా ఉంటున్నాయి. పొద్దున్నే మనం కొత్తగూడెం కూరగాయల మార్కెట్కు వెళ్తే.. రాఘవాపురం రైతులే ఎక్కువగా ఉంటారు. ఊరిపేరు అడిగితే మీసం మెలేస్తూ చెబుతారు. పుట్టినగడ్డ మీద ప్రేమ అది. ఆకుకూరల సాగులో తమకు సాటిలేదన్న ఆత్మవిశాసం అది.
ఏడాదికి ఒక పంట, రెండు పంటలు అనే పరిమితి కూడా లేదు. తీసేకొద్దీ పంటే. వేసేకొద్దీ డబ్బే. పెద్దగా పెట్టుబడీ అవసరం లేదు. దీంతో సంసారం హాయిగా సాగిపోతుంది. ఆకుకూరల సేద్యానికి ఇంకో వెసులుబాటు ఉంది. చీడపీడల ఇబ్బంది తక్కువ. నిత్యావసరం కాబట్టి, జనం కొనితీరతారు.
…? కాగితపు వెంకటేశ్వరరావు